ఇరాక్‌లో మరో ముసలం..
సాక్షి, మోసుల్ : ఐసిస్‌ను చావుదెబ్బ కొట్టి మోసుల్ పట్టణాన్ని చేజిక్కించుకున్న ఇరాక్‌లో ఇప్పుడు మరో కొత్త జగడం మొదలైంది. ఇది ఇరుగుపోరుగు దేశాలైన టర్కీ, సిరియా, ఇరాన్‌లను కలవరపాటుకు గురిచేయడమే కాకుండా అమెరికాకూ ఆందోళన కలిగిస్తోంది. ఇరాక్‌లో అంతర్భాగంగా ఉన్న కుర్దిస్థాన్ రీజినల్ గవర్నమెంట్ (కేఆర్‌జీ)కి సెమీ అటానమస్ హోదా ఉంది. కుర్దుల ఆధిపత్యం కలిగిన కుర్దిస్థాన్ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వమే పరిపాలిస్తుంది.
రెండేళ్ల విరామం తర్వాత శుక్రవారం సమావేశమైన కుర్దిస్థాన్ పార్లమెంటు స్వతంత్య్ర దేశ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని తీర్మానించింది. దహుక్, ఇబ్రిల్, సులేమానియా ఫ్రావిన్సుల్లో ఈనెల 25వ తేదీన ఈ రిఫరెండం నిర్వహించనున్నారు. దీన్ని ఇరాక్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. రిఫరెండం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.
ఎవరీ కుర్దులు?
యూరప్, ఇతర పాశ్చాత్య దేశాలకు వలస వెళ్లిన వారితో కలిపి కుర్దులు సుమారు నాలుగు కోట్ల మంది ఉంటారని అంచనా. సొంతంగా దేశమంటూ లేని అతిపెద్ద జాతిగా కుర్దులకు గుర్తింపు ఉంది. ఇరాక్‌కు ఉత్తరాన ఉండే కుర్దిస్థాన్, టర్కీకి ఆగ్నేయాన, సిరియాకు ఉత్తరాన, వాయువ్య ఇరాన్‌లలో 5 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన భూభాగంలో (ఇది నాలుగు దేశాల్లో విస్తరించి ఉంది) కుర్దులు ఉన్నారు.
కుర్దీ భాష, ఆచార వ్యవహారాల్లో సారూప్యత కారణంగా తామంతా ఒక్క జాతేననే భావన కుర్దీల్లో బలపడింది. స్వతంత్య్రదేశం కావాలనే డిమాండ్ దాదాపు వందేళ్లుగా ఉంది. ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌లో 53 లక్షల మంది నివసిస్తున్నారు. టర్కీలో కోటిన్నర మంది కుర్దులు ఉన్నారు. సిరియాలో 20 లక్షల దాకా ఉంటారు. ఇరాన్‌లో వీరి జనాభా 80 లక్షల దాకా ఉంటుంది. కుర్దుల్లో మెజారిటీ (దాదాపు 80 శాతం) సున్నీలే. మిగతా వారు షియాలు, ఇతర మతస్తులు.
వందేళ్ల డిమాండ్...
మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్య ఓటమి, పతనం అనంతరం మిత్రదేశాలు ప్రత్యేక కుర్దిస్థాన్ ప్రస్తావన తెచ్చాయి. అయితే 1923లో జరిగిన లుజానే ఒప్పందంలో... ప్రత్యేక కుర్దిస్థాన్ భావనను పట్టించుకోకుండా ఆధునిక టర్కీ సరిహద్దులు నిర్ణయించారు. దాంతో టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియాల్లో కుర్దులు అల్పసంఖ్యాక వర్గాలుగా మిగిలిపోయారు. అప్పటి నుంచి ప్రత్యేక కుర్దిస్థాన్ డిమాండ్లను పైన పేర్కొన్న దేశాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ వచ్చాయి. సద్దాం హుస్సేన్ కుర్దులను దారుణంగా హింసించాడు. 1988లో ఇరాకీ సైన్యం హలబ్జా పట్టణంలో కుర్డులపైకి రసాయనిక ఆయుధాలను సైతం ప్రయోగించింది.
టర్కీ అయితే కుర్దుల పేర్లపై, వేషధారణపై కూడా ఆంక్షలు విధించింది. అసలు వీరిని గుర్తించడానికి సైతం నిరాకరించి... పర్వతప్రాంత టర్కులుగా వీరిని పిలిచింది. టర్కీలో నివసించే కుర్దుల కోసం ప్రత్యేక రాజ్యం కావాలనే డిమాండ్‌తో 1978లో కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) ప్రారంభమైంది. 1984లో పీకేకే సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ పోరాటంలో దాదాపు 40 వేల మంది కుర్దులు ప్రాణాలు కోల్పోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో కుర్దుల స్వరాజ్యకాంక్ష 1991లో కువైట్ యుద్ధంలో ఇరాక్ ఓటమితో మళ్లీ బలపడింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణదళాలు... ఇరాక్ ఉత్తరభాగాన్ని నో ఫ్లయ్ జోన్ (ఈ భూభాగం మీదుగా విమానాలు వెళ్లకూడదు)గా ప్రకటించాయి. దాంతో ఇరాకీ బలగాలు ఈ ప్రాంతం నుంచి వెనక్కితగ్గాయి. ఫలితంగా కుర్దుల ఆర్మీ ‘పెష్‌మెర్గా’ బలపడింది.
2003లో సద్దాం హుస్సేన్‌ను పదవీచుత్యుడిని చేశాక... ఈ ప్రాంతంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ మొదలైంది. అమెరికా కనుసన్నల్లో మెలిగే ఇరాక్ ప్రభుత్వంతో పలుదఫాలుగా చర్చల అనంతరం 2005లో కుర్దిస్థాన్ ప్రాంతానికి సెమీ అటానమస్ హోదాను కల్పించి... స్వీయ పాలనకు వెసులుబాటు కల్పించారు.
పొరుగుదేశాలకు భయమెందుకు?
కుర్దిస్థాన్ రీజినల్ గవర్నమెంటు (కేఆర్‌జీ)కి 1,90,000 పటిష్టమైన సైన్యం (పెష్‌మెర్గా) ఉంది. కుర్దిస్థాన్ డెమొక్రటిక్ పార్టీ (పీడీకే) అధినేత మసూద్ బర్జానీ ఇరాక్‌లో అంతర్భాగంగా ఉన్న కుర్దిస్థాన్ ప్రాంతానికి అధ్యక్షుడు. 2005 నుంచి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పైగా పెష్‌మెర్గాకు కమాండర్ ఇన్ చీఫ్ కూడా. ఇరాక్, టర్కీలకు సరిహద్దుల్లో ఉండే కొబేన్ పట్టణంపై ఐసిస్ 2014లో దాడి ప్రారంభించినపుడు... తమ సరిహద్దుల్లోకి ఈ ఉగ్రసంస్థ చొచ్చుకువస్తున్నా... టర్కీ సైన్యాన్ని పంపడానికి నిరాకరించింది. అప్పుడు పెష్‌మెర్గా రంగంలోకి దిగి విజయవంతంగా ఐసిస్‌ను నిలువరించింది. కొబేన్ ఐసిస్ వశం కాకుండా చూసింది. అమెరికా వైమానిక దాడులు చేయడమే కాకుండా పెష్‌మెర్గాకు దిశానిర్దేశం చేయడానికి తమ యుద్ధ నిపుణులను కూడా పంపింది. దీంతో ఐసిస్‌పై పోరులో పెష్‌మెర్గాను కీలకమైన భాగస్వామిగా అమెరికా పరిగణిస్తోంది.
ప్రత్యేక రాజ్యం కోసం ఈనెల 25న రిఫరెండం నిర్వహించాలని కుర్దిస్థాన్ పార్లమెంటు తీర్మానించడంతో పొరుగుదేశాలు ఉలిక్కిపడ్డాయి. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. స్వతంత్రాన్ని ప్రకటించుకోవడానికి తాము రిఫరెండం నిర్వహించడం లేదని, స్వరాజ్యం కోసం ఇరాక్ కేంద్ర ప్రభుత్వంతో తాము భవిష్యత్తులో జరపబోయే చర్చల్లో ఈ రిఫరెండం ఫలితాలు తమకు అనుకూలంగా పనికివస్తాయని కేఆర్‌జీ అధికారులు అంటున్నారు.
రిఫరెండంలో కుర్దిస్థాన్‌కు అనుకూలంగా ప్రజాతీర్పు వస్తే... తమ దేశాల్లోని కుర్దులు కూడా ఇరాక్‌లోని కురిస్థాన్‌తో కలిసిపోతామనే డిమాండ్లతో ఉద్యమాలకు దిగుతారని టర్కీ, ఇరాన్, సిరియాల భయం. తమ దేశంలో ఇదే డిమాండ్లతో సాయుధ పోరు చేస్తున్న సంస్థలకు పెష్‌మెర్గా అండ తోడైతే... తమ దేశాల్లో అశాంతి తలెత్తుతుందని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలుగుతుందని టర్కీ, ఇరాన్ భావిస్తున్నాయి. పెష్‌మెర్గాకు అమెరికా సన్నిహితంగా ఉండటం కూడా ఇరాన్ అభ్యంతరాలకు, అనుమానాలకు మరో కారణం.
అమెరికా ఆందోళన ఏమిటంటే...
మోసుల్ స్వాధీనం ద్వారా ఐసిస్‌ను ఇరాక్‌లో పరిమిత భూభాగానికి పరిమితం చేశామని... ఇకమీదట కలిసికట్టుగా దాన్ని తుడిచిపెట్టగలమని అమెరికా భావించింది. అయితే ఇరాక్‌లోని జాతుల మధ్య అంతర్గత విబేధాలు తలెత్తితే ఐక్యత దెబ్బతింటుందని, ఐసిస్ మళ్లీ పుంజుకుంటుందని అమెరికా భయం. అస్థిరత ఏర్పడుతుందని ఆందోళన చెందుతోంది. అందుకే శుక్రవారం కుర్దిస్థాన్ పార్లమెంటు రిఫరెండం తీర్మానాన్ని ఆమోదించిన కొద్ది గంటల్లోనే వైట్‌హౌస్ స్పందించింది.
రిఫరెండం వెనక్కి తీసుకోవాలని, ఇరాక్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పిలుపిచ్చింది. ఐసిస్‌ను ఓడించే ప్రయత్నాలకు కేఆర్‌జీ తాజా చర్య భంగకరమని వ్యాఖ్యానించింది. ఆఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు తెరదించినా... సుస్థిర ప్రభుత్వం, బలమైన నాయకత్వం లేకపోతే జరిగే విపరిణామాలేమిటో అమెరికాకు బాగా తెలిసొచ్చాయి. ఇప్పటికీ ఆఫ్గానిస్థాన్ నిత్యం నెత్తురోడుతోంది. ఇలాంటిది ఇరాక్‌లో పునరావృతం కాకూడదని అమెరికా ఆశిస్తోంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్