ప్రమాదాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఎలా స్పందిస్తాయి?
న్యూయార్క్: గూగుల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఆటోడ్రైవింగ్ లేదా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మార్కెట్‌లోకి తెస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 60 శాతం మంది ప్రజలు వీటిలో ప్రయాణించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మార్కెట్‌లోకి రావడం వల్ల రోడ్లపై 90 శాతం ప్రమాదాలు తగ్గిపోతాయని, ప్రమాదాల కారణంగా వైద్య చికిత్సలకు ఖర్చవుతున్న కోట్లాది రూపాయలు మిగిలిపోతాయని వీటికి డిజైన్ చేసిన ఇంజనీర్లు తెలియజేస్తున్నారు.
ప్రమాదం అనివార్యమైనప్పుడు, పాదాచారులో లేదా కారులో ప్రయాణిస్తున్న వారో ప్రమాదంలో మరణించే ఆస్కారం ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కారు ఎలా స్పందిస్తుంది? పాదచారులను బలి చేస్తుందా లేదా కారులో కూర్చున్న వారిని బలి చేస్తుందా? పాదచారులు వృద్ధులైనప్పుడు ఎలా స్పందిస్తుంది? యువత అయినప్పుడు ఎలా స్పందిస్తుంది? అన్న నైతిక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. పాదచారులకు బదులు కారులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలనే త్యాగం చేయడం మంచిదని ఓ సైన్స్ పత్రికలో ప్రచురించిన ఓ సర్వే వెల్లడించింది. అందుకు ఓటేసిన వారిలో ఎక్కువ మంది సెల్ఫ్ డ్రైవింగ్ కారులో తిరగాలనుకునేవారు కాకపోవచ్చు. ఈ సంక్తిష్ట సమస్యను పరిష్కరించేందుకు అమెరికాలోని ‘మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’కి చెందిన నిపుణులు ప్రయత్నించారు. ‘మోరల్ మిషన్’ పేరిట వారు కొన్ని చిత్రాలను వేసి డ్రైవింగ్ సీట్లో మనమే ఉంటే ఏం చేస్తాం? అని కొన్ని ప్రశ్నలు సంధించారు.
* మొదటి రకం రెండు చిత్రాల్లో కారులో ప్రయాణికులు ఎవరూ ఉండరు. నలుగురు పాదాచారులు రోడ్డు దాటుతుంటారు. చిత్రంలో సూచించిన రెండు మార్గాల్లో ఎటు కారు వెళ్లినా ఇద్దరు పాదాచారులు చనిపోవడం ఖాయం. అప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం?
* రెండవ చిత్రాల్లో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉంటారు. రోడ్డుమీద ఐదు కుక్కలు వెళుతుంటాయి. ఒక మార్గంలో వెళిలే ఐదు కుక్కలు చనిపోతాయి, రెండో మార్గంలో వెళితే ఐదుగురు ప్రయాణికులు మరణిస్తారు. అప్పుడు ఏ మార్గం అనుసరించాలి? మనుషుల ప్రాణాలకే విలువివ్వాలి అనవచ్చు. మనషులాగా జంతువుల ప్రాణాలకు కూడా విలువివ్వాలనేవారు లేకపోలేదు.
*మూడవ రకం చిత్రాల్లో ఓ కారులో ముగ్గురు ప్రయాణికులు వెళుతుంటారు. ఎదురుగా ముగ్గురు పాదచారులు వెళుతుంటారు. మొదటి చిత్రంలో సూచించిన మార్గంలో కారు వెళితే కారులోని ముగ్గురు ప్రయాణికులు మరణిస్తారు. రెండో మార్గంలో వెళితే ముగ్గురు పాదచారులు మరణిస్తారు. అప్పుడు ఏ మార్గంలో వెళ్లడం మంచిదో మీరే తేల్చండి! అని పరిశోధకులు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నైతికంగా ఓ నిర్ణయం తీసుకోవడానికి మనకే చిక్కుముడి అయితే మనుషులు తయారు చేసిన సల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిర్ణయం సంక్లిష్టం కాదా? తుది నిర్ణయాన్ని వాటికే వదిలేస్తే మంచిదేమో!
Why the father of the self-driving car left Google