అవి వాడితే వీర్యకణాలు 70 శాతం పెరుగుతాయట
సంతానం మానవునికి జీవితంలో అత్యంత తృప్తిని కలిగించే విషయం. స్త్రీ మాతృత్వాన్ని పొందడం, అలాగే పురుషుడు పితృత్వాన్ని పొందడం ఈ కాలంలో చాలా పెద్ద విషయంగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మానవ జీవన విధానంలో అనేక మార్పులు, మానసిక ఒత్తిడి అనే విషయాల వల్ల మనిషి జీవన ప్రక్రియలలో అనేక మార్పులు వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రపంచంలో సంతానలేమి అనే సమస్య వైద్యులకు పెనుసవాలుగా మారింది. పురుషులలో సంతాన సామర్థ్యాన్ని కాలుష్యం మింగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషుల్లో వీర్యకణాలలో నాణ్యత, కణాల సంఖ్యలో తగ్గుదల అనే సమస్యలు ఎక్కువగా ఈమధ్యకాలంలో వింటున్నాం. 30 సంవత్సరాల క్రితం పురుషులలో సాధారణంగా 1 మి.లీ. వీర్యంలో 6 కోట్ల వీర్యకణాలు ఉండేవి. ఇప్పుడు గణనీయంగా 2 కోట్లకు పడిపోయింది. అలాగే వాటి కదలికలు, సహజత్వం కోల్పోతున్నాయి. ఈ మార్పుకి ప్రధాన కారణాలు - వాతావరణ కాలుష్యం, ఆహారంలో రసాయనాలు, గ్లోబల్ వార్మింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పై కారణాలతోపాటు మద్యపానం, ధూమపానం, హర్మోన్‌లలో లోపాలు, సుఖవ్యాధులు, గవద బిళ్లలు, వేరికోసిల్, అధిక బరువు, మధుమేహం కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
అయితే 'టమాట పిల్'లతో పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి సామర్థ్యం పెంచవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తిని టమాట పిల్‌లతో 70 శాతం వృద్ధి చేయవచ్చని శిఫిల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పుచ్చకాయలో లభించే లైకోపెన్, టమాటలో ఉండే ఎరుపు రంగులోనూ గుర్తించారు. లైకోపెన్‌తో మరిన్ని సప్లిమెంట్‌లను కలిపి ఈ టమాట పిల్ తయారు చేస్తారు. వీటిని పరిశీలించడానికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 60 మంది ఆరోగ్యవంతులైన పురుషులపై మూడు నెలలపాటూ పరిశోధనలు జరిపారు. ఈ విధానం ద్వారా వీర్యకణాల్లో నాణ్యతతో పాటూ, వీర్యకణాల సంఖ్య కూడా ఘననీయంగా పెరిగినట్టు గుర్తించారు. వీర్యకణాల ఉత్పత్తికి 3నెలల సమయం పడుతోందని వీరు తెలిపారు. టమాట పిల్‌ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్‌లాంటివి కూడా ఉండవని వీరంటున్నారు.