న్యూయార్క్ : రెప్పపాటులోనే భారీ బ్రడ్జిని నేలమట్టం చేశారు. న్యూయార్క్ మహానగరంలో అతిపెద్ద కౌంటీలైన బ్రూక్లిన్, క్వీన్స్‌లను కలుపుతూ 78 ఏళ్ల కిందట నిర్మించిన కిజ్కియాస్కో వంతెనను అధికారులు ఆదివారం ఉదయం పేల్చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈస్ట్ నదికి ఉపనది అయిన న్యూటౌన్ క్రీక్‌పై కట్టిన కిజ్కియాస్కో బ్రిడ్జి పొడవు 1.8 కి.మీలు. వెడల్పు 38 మీటర్లు. 1939, ఆగస్టు 23న ప్రారంభమైన ఈ బ్రాడ్జిని నాటి అంచనాల దృష్ట్యా రోజుకు 10వేల కార్లు ప్రయాణించగల సామర్థ్యంతో నిర్మించారు. కానీ క్రమంగా కిజ్కియాస్కోపై రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య 1.8 లక్షలకు పెరిగింది. దీంతో ప్రమాద అవకాశాలను గుర్తించిన అధికారులు ఈ ఏడాది(2017) ప్రారంభం నాటికి కిజ్కియాస్కోకు సమాంతరంగా అధునాతన మీకర్ అవెన్యూ బ్రిడ్జిని నిర్మించారు. 2017, ఏప్రిల్, 27నుంచి పాత వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపేశారు.
అప్పటి నుంచి కొనసాగుతోన్న కూల్చివేత ప్రక్రియ ఆదివారం నాటి పేల్చివేతతో చివరిదశకు చేరింది. శక్తిమంతమైన డిటోనేటర్లతో జరిపిన పేలుడుకు వంతెనకు సమీపంలోని ఇళ్లు వణికిపోయాయి. కూల్చివేసిన వంతెన స్థానంలో 2020 నాటికి సరికొత్త బ్రిడ్జిని నిర్మించబోతున్నట్లు న్యూయార్క్ గవర్నర్ వెల్లడించారు.