లండన్‌ జైల్లో నీరవ్‌ మోదీ | Nirav Modi arrested in London | Sakshi
Sakshi News home page

లండన్‌ జైల్లో నీరవ్‌ మోదీ

Published Thu, Mar 21 2019 3:03 AM | Last Updated on Thu, Mar 21 2019 4:46 AM

Nirav Modi arrested in London - Sakshi

లండన్‌ / న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ)కు రూ.13,500 కోట్ల కుచ్చుటోపీ పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(48)ని స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు బ్రిటన్‌లో అరెస్ట్‌ చేశారు. లండన్‌లోని మెట్రో బ్యాంకులో ఖాతా తెరిచేందుకు మంగళవారం వచ్చిన మోదీని గుర్తించిన క్లర్క్‌ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు మోదీని అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నగరంలోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో బుధవారం మోదీని హాజరుపరచగా, కోర్టు ఆయనకు మార్చి 29 వరకూ కస్టడీ విధించింది. నీరవ్‌ మోదీకి బెయిల్‌ నిరాకరించిన న్యాయమూర్తి మేరీ మల్లాన్‌.. ఒకవేళ బెయిల్‌ ఇస్తే ఆయన కోర్టు ముందు హాజరుకాబోరని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరోవైపు స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు మాట్లాడుతూ..భారత అధికారుల విజ్ఞప్తి మేరకు నీరవ్‌ను హోల్‌బోర్న్‌ ప్రాంతంలో అరెస్ట్‌ చేశామని తెలిపారు. మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దాఖలుచేసిన పిటిషన్‌ ఆధారంగా లండన్‌లోని ఓ కోర్టు నీరవ్‌ అరెస్ట్‌కు వారెంట్‌ జారీచేసిందన్నారు.

అతిప్రచారం కారణంగానే అరెస్ట్‌
నీరవ్‌ మోదీ తరఫున బారిస్టర్‌ జార్జ్‌ హెప్‌బర్న్‌ స్కాట్, ఆనంద్‌ దూబే వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో వాదనలు వినిపిస్తూ..‘నీరవ్‌ మోదీపై చేసిన ఆరోపణలన్నింటిని మేం ఖండిస్తున్నాం. నీరవ్‌ను స్వదేశానికి తిప్పిపంపే విషయంలో ఆయన న్యాయబృందం స్కాట్‌లాండ్‌యార్డ్‌ పోలీసులతో కొన్నినెలలుగా చర్చలు జరుపుతోంది. ఇందుకు నీరవ్‌ మోదీ పూర్తిగా సహకరిస్తున్నారు. వచ్చే సోమవారం సెంట్రల్‌ లండన్‌ పోలీస్‌స్టేషన్‌లో నీరవ్‌ లొంగిపోయేందుకు ఆయన న్యాయబృందం, స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు ఓ అంగీకారానికి వచ్చారు.

కానీ ఈ కేసులో జరిగిన అతిప్రచారం కారణంగా నీరవ్‌ను చూడగానే బ్యాంక్‌ క్లర్క్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆయన్ను ముందుగానే అరెస్ట్‌ చేశారు. నీరవ్‌ ప్రస్తుతం డైమండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థలో నెలకు 20,000 పౌండ్ల(18.15 లక్షలు) వేతనానికి పనిచేస్తున్నారు. పన్నులను నిర్ణీత గడువులోగా చెల్లిస్తున్నారు. కాబట్టి ఆయనకు బెయిల్‌ మంజూరు చేయండి. నీరవ్‌ తరఫున బెయిల్‌ కోసం 5,00,000 పౌండ్లు పూచీకత్తు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. లిక్కర్‌ కింగ్, కింగ్‌ ఫిషర్‌ సంస్థ అధినేత విజయ్‌మాల్యా తరఫున వాదించిన జార్జ్‌ హెప్‌బర్న్‌ బృందాన్నే నీరవ్‌ ఎంపిక చేసుకోవడం గమనార్హం.

అప్పగింత ప్రక్రియ వేగవంతం
విజయ్‌మాల్యాతో పోల్చుకుంటే నీరవ్‌ మోదీని భారత్‌కు బ్రిటన్‌ అప్పగించే ప్రక్రియ వేగంగా సాగే అవకాశముందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎందుకంటే నీరవ్‌ మోదీ పీఎన్‌బీ బ్యాంకును మోసం చేసినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకే 2017, ఏప్రిల్‌లో మాల్యాకు బెయిల్‌ మంజూరుచేసిన కోర్టు, నీరవ్‌కు మాత్రం నిరాకరించిందని వ్యాఖ్యానించారు. దీనికితోడు భారత్‌ గట్టి సాక్ష్యాలను బ్రిటన్‌లోని న్యాయస్థానానికి సమర్పించిందని పేర్కొన్నారు.

నీరవ్‌ అరెస్ట్‌ను స్వాగతిస్తున్నాం: భారత్‌
నీరవ్‌ మోదీ అరెస్ట్‌ను భారత్‌ స్వాగతించింది. నీరవ్‌ అప్పగింత విషయంలో భారత్‌ బ్రిటన్‌తో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు.ఆయన్ను వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకొచ్చేందుకు బ్రిటన్‌ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.  

బెయిల్‌ ఇస్తే దొరకడు
జార్జ్‌ హెప్‌బర్న్‌ స్కాట్, ఆనంద్‌ దూబే వాదనల్ని భారత్‌ తరఫున వాదిస్తున్న క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌(సీపీఎస్‌)కు చెందిన జొనాథన్‌ స్వైన్‌ ఖండించారు. ‘భారత్‌లో దాదాపు రూ.13,500 కోట్లు అక్రమ నగదు చలామణి, మోసానికి పాల్పడ్డ కేసులో నీరవ్‌ మోదీ నిందితుడిగా ఉన్నారు. బ్రిటన్‌ చట్టాల ప్రకారం మోసం చేసేందుకు కుట్ర పన్నితే కనీసం ఏడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అలాగే మోసం చేశాక రహస్యంగా దాక్కునేందుకు ప్రయత్నిస్తే పదేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష విధించవచ్చు.

నీరవ్‌ మోదీకి బెయిల్‌ ఇవ్వడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఓసారి బెయిల్‌ మంజూరు చేస్తే నీరవ్‌ మరోసారి కోర్టు ముందు హాజరుకాకపోవచ్చు’ అని జొనాథన్‌ కోర్టుకు విన్నవించారు. దీంతో ఇరుపక్షాల వానదలు విన్న జిల్లా జడ్జి మేరీ మల్లాన్‌.. నీరవ్‌ మోదీపై ఉన్న ఆరోపణలు, భారీ నగదుకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసులో బెయిల్‌ నిరాకరిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ బెయిల్‌ ఇస్తే కోర్టు విచారణ నుంచి ఆయన తప్పించుకోవడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  

హర్‌ మెజెస్టీ జైలుకు నీరవ్‌ మోదీ
స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్‌చేసిన నీరవ్‌ మోదీని వాండ్స్‌వర్త్‌లోని ‘హర్‌ మెజెస్టీ జైలు’కు తరలించే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి. అక్కడే జైలులో ప్రత్యేక గదిని మోదీకి కేటాయించే అవకాశముందని లేదంటే మిగతా ఖైదీలతో గదిని పంచుకోవాల్సి రావొచ్చని వెల్లడించాయి. లండన్‌ శివార్లలో ఉన్న ఈ జైలు పశ్చిమ యూరప్‌లోనే అతిపెద్దది. ఈ జైలును ‘బీ’ కేటగిరిలో చేర్చారు. అంటే హైలెవల్‌ సెక్యూరిటీ రిస్క్‌ లేని వ్యక్తులను ఇక్కడ ఉంచుతారు.

1851లో ఏర్పాటైన ఈ జైలు ఖైదీలతో కిటకిటలాడుతోందనీ, ప్రస్తుతం ఇక్కడ 1,628 మంది ఖైదీలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో చాలామంది డ్రగ్స్‌ స్మగ్లర్లు, వ్యసనపరులు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఉన్నారని వెల్లడించారు. అక్కడ మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉంటాయనీ, ఖైదీలను జైలు గది బయట ఎక్కువసేపు తిరగనివ్వరని వ్యాఖ్యానించారు. నీరవ్‌ మోదీ ఈ నెల 29 వరకూ ఇదే జైలులో ఉంటారని చెప్పారు. కాగా, ప్రస్తుతం హర్‌ మెజెస్టీ జైలులో మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు జబైర్‌ మోతీ కూడా ఉన్నాడనీ, అతడిని అప్పగించాలని అమెరికా కోరుతుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement