
'ప్రియా నిను చూడలేక...'
న్యూయార్క్: వయస్సు మీద పడుతున్నాకొద్దీ దంపతుల మధ్య ప్రేమ క్షీణిస్తూ వస్తోందని మనమంతా భావిస్తాం. అది ఒట్టి భ్రమేనని, తుది శ్వాస వీడే వరకు అది వెన్నంటే ఉంటుందని ఈ బామ్మ, తాతయ్యలు నిరూపిస్తున్నారు. అమెరికాకు చెందిన 93 ఏళ్ల లారా అస్వస్థతతో ఆస్పత్రిలో చేరింది. తుది శ్వాస ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ఆమె మంచానికి అతుక్కుపోయి ఉంది. 92 ఏళ్ల భర్త హోవర్డ్ ఓ రోజు భార్య మంచం వద్దకు వచ్చి అనునయంగా ఆమె చెంప నిమిరాడు. కళ్లలోకి కళ్లు పెట్టి ఆప్యాయంగా చూశాడు.
గత యాభై ఏళ్లుగా తాము యుగళగీతంగా పాడుకుంటున్న రోజ్‌మేరీ క్లూనీ (హాలివుడ్ నటి, ప్రముఖ కేబరే సింగర్) 1940లో పాడిన ప్రసిద్ధ పాట ‘యూ విల్ నెవర్ నో’ పాటందుకున్నాడు హోవర్డ్. నీడను, వెలుతురును మాత్రమే చూడగలిగిన లారా తదేకంగా భర్తవైపే చూస్తూ గళంలో గళం కలిపేందుకు ప్రయత్నించింది. ‘యు విల్ నెవర్ నో హౌ మచ్ ఐ లవ్ యూ’ అని భర్త పాడుతుంటే ‘ఏ మిలియన్ టైమ్స్ ఆర్ మోర్’ అంటూ అస్పష్టంగా భార్య గొంతు కలిపింది.
పాట అనంతరం హోవర్డ్ చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ భార్య పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు. ‘థాంక్యూ’ అంటూ లారా భర్తను ఉద్దేశించి వ్యాఖ్యానించడం కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘ఆల్ వేస్ ఈ లవ్స్ మీ’ అంటూ మంచానికి సమీపంలోవున్న మనవరాలు ఎరిన్ సొలారీని ఉద్దేశించి బామ్మ మాట్లాడింది.
ఈ మొత్తం దృశ్యాన్ని ఎరిన్ సొలారీ తన మొబైల్ ఫోన్ ద్వారా వీడియో తీసి తన ‘ఫేస్‌బుక్’ పేజీలో పోస్ట్ చేసింది. నేటికి ఈ వీడియో దాదాపు 40 లక్షల మంది వీక్షించారు. తమ బామ్మ, తాత ఎంతోమందికి ఆదర్శంగా జీవించారని, పెళ్లినాటి ప్రమాణాలను వారు ఎప్పుడూ విస్మరించలేదని ఎరిన్ తెలిపారు. తమ ప్రతి కుటుంబ పార్టీలో వారిద్దరు ‘యు విల్ నెవర్ నో’ పాటను యుగళగీతంగా పాడుతూ వచ్చారని ఆమె చెప్పారు. కాస్త కోలుకోవడంతో బామ్మను ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చామని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటోందని ఎరిన్ ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు.