ఎక్కడ ఉన్నా.. తెలుగువారంతా ఒక్కటే
- రెండో రోజూ అంగరంగ వైభవంగా ఆటా ఉత్సవాలు
- బతుకమ్మ బోనాలతో ఘనస్వాగతం
- హాజరైన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు
రాయికల్ : ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ, ఆంధ్రా ప్రజలంతా ఒక్కటేనని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అమెరికాలోని షికాగోలో ఆటా రజతోత్సవాలు రెండో రోజు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు సాగాయి. కార్యక్రమానికి ఎంపీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏదైనా ప్రమాదం జరిగితే తెలుగువారు ఎలా ఉన్నారని సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని కవిత చెప్పారు. గతంలో అమెరికా అంటేనే తానా మహాసభలు, ఆటా మహాసభలు గుర్తుకు వచ్చేవని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు ఆచార సంప్రదాయాలను కాపాడటం కోసం ఆటా చేస్తున్న కృషి, సహకరించిన ప్రతినిధులను అభినందించారు. కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాలు విడిపోయాయని అన్నారు.
జై తెలంగాణ.. జై ఆంధ్ర... జై హింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగిం చారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం అలరించింది. కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ బోనాలతో సభావేదికపైకి చేరుకోవడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మధుయాష్కీగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, ఆటా సంఘం అధ్యక్షుడు పెర్‌కారి సుధాకర్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.