
న్యూఢిల్లీ: ఈ నెల 13, 14 తేదీల్లో కిర్జిస్తాన్ రాజధాని బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పాకిస్థాన్ అధినేత ఇమ్రాన్ ఖాన్ మధ్య సమావేశం ఉండబోదని భారత్ గురువారం స్పష్టం చేసింది. తనకు తెలిసినంతవరకు బిషక్‌లో ఎస్‌సీవో సదస్సు సందర్భంగా మోదీ, ఇమ్రాన్ ఖాన్ భేటీకి ప్లాన్ చేయలేదని, వారిద్దరి మధ్య సమావేశం ఉండే అవకాశం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఎస్‌సీవో సదస్సు అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగే అవకాశముందా? అన్న ప్రశ్నకు కూడా.. అలాంటి అవకాశం లేదని, సమీప భవిష్యత్తులో ఇలాంటి చర్చల గురించి ప్లాన్ చేయలేదని ఆయన తేల్చిచెప్పారు.
2016లో పఠాన్‌కోట్ వైమానిక శిబిరంపై ఉగ్రవాద దాడి అనంతరం భారత్, దాయాది పాకిస్థాన్‌తో అధికారిక చర్చలను నిలిపివేసింది. ఉగ్రవాదం, చర్చలు కలిసిసాగలేవంటూ అప్పటినుంచి దాయాదితో ద్వైపాక్షిక చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఈ నెల 13, 14 తేదీల్లో బిషక్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అటు పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా ఈ సదస్సుకు వస్తుండటంతో వీరిద్దరు భేటీ కావొచ్చునని ఊహాగానాలు వినిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment