ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసం నానాటికీ సన్నగిల్లుతోంది. ప్రపంచంలో 49 శాతం దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థనే అనుసరిస్తున్నా.. సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని కలిగిన దేశాలు 4.5 శాతం మాత్రమే ఉన్నాయి. 2015 సంవత్సరంలో సంపూర్ణ ప్రజాస్వామ్యం కలిగిన దేశాలు 9 శాతం ఉండగా, 2016 నాటికి సగానికి సగం తగ్గాయి. సంపూర్ణ ప్రజాస్వామ్యం కలిగిన దేశాల్లో నార్వేనే అగ్రస్థానంలో ఉండటం మరో విశేషం. ప్రపంచంలో ప్రజలు అత్యధికంగా సంతోషంగా ఉన్న దేశంగా కూడా నార్వేనే ఇటీవల గుర్తింపు పొందిన విషయం తెల్సిందే.
సంపూర్ణ ప్రజాస్వామ్యం కలిగిన దేశాల్లో నార్వే తర్వాత వరుసగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, కెనడా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఫిన్‌లాండ్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. 2006 నుంచి వరుసగా ప్రతి ఏడాది ఫలితాలను విశ్లేషించగా అమెరికాలో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం తగ్గుతోంది. ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజలకు విశ్వాసం తగ్గడమే ఇందుకు కారణం. 2006లో 8.22 శాతం మంది అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం వ్యక్తం చేయగా, 2016లో వారి సంఖ్య 7.98 శాతానికి తగ్గింది. అదే బ్రిటన్ ప్రజల్లో ప్రజాస్వామ్యం వ్యవస్థ పట్ల విశ్వాసం పెరుగుతోంది. అందుకే అది సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశాల్లో 16వ స్థానంలో ఉంది.
ఎన్నికల ప్రక్రియను, బహుళత్వ సమాజాన్ని, పౌరహక్కుల పరిస్థితులను, ఎన్నికల్లో రాజకీయ భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 2006 నుంచి ప్రతి ఏటా ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల సూచికను రూపొందిస్తోంది. ఈసారి చిన్నా చితకా దేశాలను వదిలేసి 160 దేశాలతో సూచికను రూపొందించింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఈ వ్యవస్థ పట్ల విశ్వాసం సన్నగిలుతుండగా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాలకన్నా ఆసియా దేశాల ప్రజల్లో విశ్వాసం ఎక్కువగా తగ్గడం విశేషం.
ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గుతోంది
Published Sat, Mar 25 2017 4:22 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement