జుకర్‌బర్గ్‌నుపక్కకు జరిపిన మోదీ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తాను కెమెరాలకు బాగా కనిపించేందుకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను పక్కకు జరుపుతున్న వీడియోదృశ్యం దుమారంరేపుతోంది. ఆదివారం సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌బుక్ కార్యాలయంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ముఖాముఖికి ముందు జుకర్‌బర్గ్, ఫేస్‌బుక్ సీఓఓ షెరిల్ శాండ్‌బర్గ్‌లు మోదీకి మెమెంటో ఇస్తుండగా ఆయన కెమెరాకు బాగా కనిపించేందుకు జుకర్‌బర్గ్ చేయిపట్టుకునిపక్కకు జరుపుతున్నట్లు ఈ వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారమవుతున్న దీనిపై కాంగ్రెస్ స్పందిం చింది. ‘ప్రధాని ఫోటోలకు, ప్రచార ఆర్భాటానికి, విదేశీ పర్యటనలకు పెట్టింది పేరు. ఆయన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి తాను ప్రధానినని తెలుసుకోవాలి. విదేశాల్లో ఉన్నప్పుడు స్కూలు పిల్లాడిలా ప్రవర్తించకూడదు’ అని పార్టీ ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు.
ఇంటర్నెట్.ఆర్గ్‌కు మద్దతు కాదు
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డిజిటల్ ఇండియా’కు మద్దతుగా ఫేస్‌బుక్ ప్రారంభించిన జాతీయ జెండా త్రివర్ణాల నేపథ్యంలోని ప్రొఫైల్ ఫొటోలు వివాదాస్పదంగా మారాయి. ఫేస్‌బుక్ వంటి కొన్ని వెబ్‌సైట్లను మాత్రమే ఉచితంగా అందించే వివాదాస్పద ఇంటర్నెట్.ఆర్గ్‌ను ప్రమోట్ చేసుకోవడానికే ఈ ఎత్తుగడ వేశారంటూ సోషల్ మీడియాలో, బయటా ఉద్యమకారుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దీనిపై ఫేస్‌బుక్ వివరణ ఇచ్చింది. కేవలం ‘డిజిటల్ ఇండియా’కు ప్రోత్సాహకంగానే ఈ త్రివర్ణ ప్రొఫైల్ ఫోటోలను, టూల్‌ను ఏర్పాటు చేశామని... ఇది ఎంతమాత్రం ఇంటర్నెట్.ఆర్గ్‌ను ప్రమోట్ చేసుకోవడం కాదని స్పష్టం చేసింది.