స్టాక్‌హోమ్ : మూవీ మొఘల్ వెయిన్‌స్టెన్ వ్యవహారం బయటపడ్డాక మీటూ క్యాంపెయిన్ మూలంగా ప్రపంచం నలుమూలల ఇప్పటిదాకా జరిగినే వేధింపుల పర్వాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతులను అందించే స్వీడిష్ అకాడమీ కూడా ఆ జాబితాలో నిలవటం విశేషంగా నిలిచింది.
సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందిస్తుందన్న విషయం తెలిసిందే. దాగెన్స్ నైహెటర్ అనే ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. మొత్తం 18 మంది మహిళలు అకాడమీకి చెందిన ఓ ప్రముఖుడి చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కున్నట్లు తెలుస్తోంది. ఆయన పేరును మాత్రం వెల్లడించకపోయినా.. హింట్లు మాత్రం ఇచ్చేసింది.
స్వీడిష్ అకాడమీకి చెందిన ఆయన ఓ రచయితను వివాహం చేసుకున్నాడని.. అకాడమీ డబ్బులతోనే ఓ కల్చరల్ క్లబ్ కూడా నిర్వహిస్తున్నాడని, పైగా అకాడమీ లివింగ్ రూమ్‌లోనే వ్యవహారాలను వెలగబెట్టేవాడంటూ పేర్కొంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద చర్చే నడుస్తోంది.
ప్రతీ ఒక్కరికీ తెలుసు...
1996 నుంచి 2017 మధ్య ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా చాలా మంది మహిళలు మీడియా ముందుకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పారు. స్టాక్ హోమ్‌లోని ఓ పోష్ అపార్ట్‌మెంట్‌లో అత్యాచారానికి గురయ్యానని ఓ మహిళ ఆరోపణలతో ఇది మొదలైంది. ఆయనెవరో ప్రతీ ఒక్కరికీ తెలుసు... కెరీర్ నాశనం అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది బయటపడటం లేదని కూడా ఆమె తెలిపారు.
ఇక మీటూ లో భాగంగా ఆయన వ్యవహారంపై స్విస్ మంత్రి అలై కుంకే కూడా స్పందించటం గమనార్హం. 2015 లో పోలార్ స్టార్ అవార్డును ఆయనకు అందజేసేందుకు తనని ఆహ్వానించారని.. కానీ, రాజ కుటుంబానికి, విదేశీయులకు గుర్తింపుగా ఇచ్చే ఆ అవార్డును అలాంటోడికి అందించటం ఇష్టం లేక తాను ఆ కార్యక్రమానికి హాజరుకాలేని ఆమె చెప్పారు. ఇంత వ్యవహారం జరిగినా ఆయన పేరును ప్రకటించేందుకు ఏ ఒక్క స్విస్ మీడియా కూడా ముందుకు రావటం లేదు.
దాగెన్స్ నైహెటర్ కథనంపై వెలువడ్డాక గురువారం స్వీడిష్ అకాడమీ కమిటీ సభ్యులు అత్యవసర భేటీ నిర్వహించారు. అనంతరం మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ... ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తితో ఎప్పుడో సంబంధాలు తెంచేసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. పురస్కరాల విషయంలో ఆయన ప్రభావం ఏమైనా చూపారా? అన్న అంశంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఇక అకాడమీ సభ్యులు- వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన బాధితులేనని ఓ అధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment