సియోల్: కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలను చేపట్టింది. తక్కువ దూరాలను ఛేదించే రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఆ దేశం గురువారం సముద్రంలోకి ప్రయోగించి కలకలం రేసింది. ఇప్పటివరకు న్యూక్లియర్ పరీక్షల నిలుపుదలపై అమెరికాతో ఉత్తర కొరియా జరుపుతున్న చర్చలు తాజా ప్రయోగంతో సంక్లిష్టమవ్వనున్నాయి. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ల మధ్య కుదిరిన అణు నిరోధక చర్చల తర్వాత జరిగిన మొదటి క్షిపణి ప్రయోగం ఇదే. క్షిపణుల ప్రయోగాన్ని చేపట్టినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ధ్రువీకరించారు. కొత్త రకం క్షిపణులుగా కనిపిస్తున్న వీటిలో ఒకటి 430 కిలోమీటర్ల దూరం వెళ్లగా.. రెండోది 690 కిలోమీటర్లు వెళ్లినట్లు సియోల్‌లోని అధికారి తెలిపినట్లు సమాచారం.
దక్షిణ కొరియాకు హెచ్చరికగా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు కిమ్ జంగ్ ఉన్ ప్రకటించారు. ఆయనే స్వయంగా ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. శాంతి మంత్రం జపిస్తూనే దక్షిణ కొరియా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని కిమ్ మండిపడ్డారు. అత్యంత అధునాతన ఆయుధాలు సమకూర్చుకుంటూ, అమెరికాతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందన్నారు. తమ హెచ్చరికను పెడచెవిన పెడితే కొరియా నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాగా, ఉత్తర కొరియాతో చర్చలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. అయితే కిమ్ కవ్వింపు చర్యలు మానుకోవాలని సూచించింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ కూడా స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment