నియంతతో ఆటలా.. ఎంత ధైర్యం!
ప్యోంగ్ యాంగ్: ఇప్పటికీ నియంతృత్వం అమలవుతున్న దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పిలిచే ఈ దేశంలో చాలా కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. ఇప్పటివరకు 340 మందికి మరణశిక్ష విధించిన క్రూరుడుగా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు పేరుంది. తండ్రి కిమ్ జాంగ్-2 మరణానంతరం 2011లో పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2016 చివరి వరకు కిమ్ ఈ శిక్షలు విధించడం గమనార్హం. అలాంటి నియంతతో ఓ వ్యక్తి చనువుగా ఉండటమే అసాధ్యమైన పని.. అలాంటిది కిమ్‌తో ఓ వ్యక్తి సరదాగా ఎంతో చనువుగా ఆట (ఇక్కడ మనం ఆడే ఉప్పు బస్త ఆట) ఆడటం తీవ్ర చర్చనీయాంశమైంది.
తనకు అడ్డొస్తాడని భావించి ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ను హత్య చేయించిన విషయం తెలిసిందే. అలాంటిది ఓ అధికారితో కిమ్ ఎందుకంత సన్నిహితంగా ఉన్నాడా అనే ప్రశ్న అందరినీ ఆలోచింప జేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో బయటకు రావడంతో విషయం బయటకు వచ్చింది. విషయం ఏంటంటే.. క్షిపణి పరీక్షలతో తరచుగా వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా ఇటీవల కూడా ఓ రాకెట్ మిస్సైల్, ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. అది విజయవంతమైనట్లుగా కొరియా న్యూస్ ఏజెన్సీ ప్రకటించుకుంది.
ఈ ప్రయోగం కోసం ఎంతగానో శ్రమించిన అధికారులను నియంత కిమ్ అభినందించారు. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి ఏకంగా కిమ్ వీపుపై ఎక్కేసి సరదాగా ఈ ఆనందాన్ని ఆస్వాదించాడు. బంధువులను, అధికారులను వారికి సంబంధించిన వారి ముందే క్రూరంగా చంపించే కిమ్.. ఆ అధికారిని ఒక్కమాట అనగపోగా.. తాను కూడా చిన్న పిల్లాడిగా చిరునవ్వులు చిందించారు. అధికారి పేరు మాత్రం బయటకు రాలేదు. ఆ ఆఫీసర్ నేతృత్వంలోనే రాకెట్ ను ప్రయోగించడంతో పాటు, మరిన్ని ఖండాంతర క్షిపణుల ప్రయోగాలలో ఆయన పాత్ర కీలకమని భావించిన కిమ్ ఆ ఆఫీసర్‌ను శిక్షించలేదని మీడియాలో కథనాలు ప్రచారం అయ్యాయి.