ఉత్తర కొరియా దూకుడు
ప్యోంగ్ యాంగ్: పలు దేశాల హెచ్చరికలను బేఖాతరుచేస్తూ 'శాటిలైట్' క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించి ఉత్తర కొరియా దూకుడు ప్రదర్శించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లడంతోపాటు దాదాపు 3,400 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించగల ఖండాంతర క్షిపణిని స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది.
ఆ దేశ నియంత నేత కింగ్ జాంగ్ ఉన్ స్వయంగా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కు వచ్చి ప్రయోగాన్ని వీక్షించారు. క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలు అధికారిక టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యాయి. పెంటగాన్, జపాన్ సైన్యాలు కూడా క్షిపణి ప్రయోగం నిజమేనని నిర్ధారించాయి.
ఇప్పటికే హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో తూర్పు ఆసియాపై ఆవహించిన యుద్ధమేఘాలకు ఇంకాస్త కారునలుపును పులుమిన ఉత్తర కొరియా.. తాజా ప్రయోగంతో ప్రపంచదేశాల ఆగ్రహానికి గురైంది. కొరియా తన దుశ్చర్యలను మానుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ హెచ్చరించారు. భద్రతామండలిని అత్యవసరంగా సమావేశపర్చి ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు డిమాండ్ చేశాయి.
టోక్యోలో జపాన్ ప్రధాని షిజో అబే మాట్లాడుతూ 'ఒకినావా ద్వీపంలో మోహరించిన తమ సైన్యాలకు ఉత్తరకొరియా ప్రయోగించిన క్షపణి స్పష్టంగా కనిపించిందని, తమ గగనతలంలోకి వస్తే పేల్చేస్తామని హెచ్చరించినప్పటికీ కొరియా దుస్సాహసానికి ఒడిగట్టింది. వెంటనే ఆ దేశంపై చర్యలు చేపట్టాలి' అని పేర్కొన్నారు.