
'జపాన్‌ను సముద్రంలో ముంచేస్తాం'
సియోల్: జపాన్ సముద్రంలో ముంచెస్తామని జగడాల మారి ఉత్తర కొరియా హెచ్చరించింది. అమెరికాతో కలిసి తమపై కుట్ర చేస్తున్న ఆ దేశాన్ని ఇక ఎంతో కాలం తమకు సమీపంగా ఉంచబోమంటూ వార్నింగ్ ఇచ్చింది. జపాన్‌కు చెందిన ఆర్చిపిలాగో నాలుగు ద్వీపాలను ఒక అణుబాంబు వేయడం ద్వారా చిత్తు చేసి సముద్రంలో ముంచేస్తామని, దాంతో ఇక జపాన్ తమ దరి చేరలేదంటూ బెదిరించింది. ఐక్యరాజ్యసమితిపై కూడా ఉత్తర కొరియా తీవ్ర విమర్శలు చేసింది. లంచాలు తీసుకునే కొన్ని దేశాలు అన్ని కలిసి తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే తాజాగా ఐరాసలో అమెరికా పెట్టిన తీర్మానం అని అభివర్ణించింది.
ఇక ఏమాత్రం అణు పరీక్షలు చేయడానికి వీల్లేదని చెప్పడంతోపాటు ఉత్తర కొరియాకు బొగ్గు, ఖనిజాలు, ఇంధన ఎగుమతులు ఆపేయాలని, ఉత్తర కొరియాకు చెందిన టెక్స్‌టైల్స్‌ను ఎవరూ దిగుమతి చేసుకోవద్దనే పేరిటీ తీర్మానం రూపొందించి భద్రతామండలిలో అమెరికా ప్రవేశపెట్టింది. దీనిని సభ్యత్వ దేశాలన్ని కూడా ఆమోదించాయి. జపాన్, అమెరికా ఆఖరికి చైనా కూడా ఆ తీర్మానానికి ఆమోదం చెప్పడంతో ఉత్తర కొరియా మండిపడింది. అసలు భద్రతా మండలి అనేదే ఒక దుష్టశక్తి అని, దానిని బద్ధలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందులో ఉన్నసభ్యత్వ దేశాలన్ని కూడా లంచం తీసుకొని పనిచేసే అవినీతి దేశాలు అంటూ తిట్టిపోసింది. అందుకే, ముందుగా తాము జపాన్‌ను టార్గెట్ చేసుకొని దాని భూభాగాలను సముద్రంలో ముంచివేస్తామని, దాని ద్వారా అమెరికాలో మరింత భయాన్ని సృష్టించిన అక్కడ కూడా చీకట్లు నిండేలా చేస్తామంటూ హెచ్చరించింది. ఈ నెల(సెప్టెంబర్) 3న ఉత్తర కొరియా అణు పరీక్షలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.