ఒబామా.. మీ సారీ సరిపోదు!
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిపి దాదాపు 71 ఏళ్లు. అణుబాంబు బీభత్సం మానవాళి మనుగడపై, భూ పర్యావరణంపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతుందో.. ఈ దాడితో స్పష్టమైనా.. ప్రపంచమంతటా అణ్వాయుధాల కోసం దేశాల మధ్య పోటాపోటీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాలో పర్యటించాలనుకుంటున్నారట.
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సోమవారం హిరోషిమాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒబామా కూడా హిరోషిమాలో పర్యటించాలనుకుంటున్నారని, వచ్చే మే నెలలో గ్రూప్ ఆఫ్ సెవన్ సదస్సు కోసం జపాన్ రానున్న ఆయన షెడ్యూల్‌లో హిరోషిమా పర్యటన ఉందా? లేదా? అన్న విషయం తెలియదని కెర్రీ చెప్పారు. నిజానికి ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా హిరోషిమాలో పర్యటించేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో ఒబామా హిరోషిమాను సందర్శించాలని కోరుకుంటున్నారనడంపై అనాటి బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు భిన్నంగా స్పందిస్తున్నారు. పెను విధ్వంసం సృష్టించిన అణుబాంబు దాడిపై ఒబామా క్షమాపణలు చెబితే సరిపోదని, అగ్రరాజ్యంగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ నిరోధానికి ఆయన కృషి చేయాలని హిరోషిమా అణుబాంబు దాడి బాధితులు కోరుతున్నారు.
1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిలోనూ అణుబాంబులు కురిపించింది. అప్పటికే రెండో ప్రపంచయుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమవుతున్న జపాన్‌పై ఈ అణుబాంబు దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జపనీయులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఓ చిన్న సారీ చెప్పడం వల్ల.. ఈ తప్పు మన్నించేది కాదని వారు అంటున్నారు. మరోవైపు అమెరికన్లు ఈ అణుబాంబు దాడులను సమర్థిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సిన పనే లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామా హిరోషిమాలో పర్యటిస్తారా? పర్యటిస్తే.. అక్కడి ప్రజలకు ఏం చెప్తారు? ఇది తప్పని ఒప్పుకొంటారా? అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది.