ఆ అణుదాడిపై క్షమాపణ చెప్పబోను: ఒబామా
టోక్యో: జపాన్‌లోని హిరోషిమాలో అమెరికా అణుదాడిపై క్షమాపణ చెప్పబోనని శ్వేతసౌధం అధిపతి బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఈ వారంలో జపాన్ పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా చేయబోయే వ్యాఖ్యల్లో క్షమాపణ కూడా ఉంటుందా? అని జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే అడుగగా.. 'లేదు. యుద్ధ సమయాల్లో నేతలు అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారని గుర్తించాల్సిన అవసరముంది' అని అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు.
'ఆ నిర్ణయాలను పరిశీలించి ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత చరిత్రకారులది. గత ఏడున్నర దశాబ్దాలుగా దీనిపై కృషి చేస్తున్న చరిత్రకారులు యుద్ధం సమయంలో కష్టమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని అభిప్రాయపడుతున్నారు' అని ఒబామా అన్నారు.
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిపి దాదాపు 71 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాలో పర్యటించబోతున్నారు. హిరోషిమాను సందర్శిస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఆయనే కావడంతో.. ఆనాటి బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు ఒబామా నుంచి పశ్చాత్తాపం ఆశిస్తున్నారు.
1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిలోనూ అణుబాంబులు కురిపించింది. అప్పటికే రెండో ప్రపంచయుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమవుతున్న జపాన్‌పై ఈ అణుబాంబు దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జపనీయులు భావిస్తున్నారు.