న్యూఢిల్లీ : ఉత్తర కొరియాలో ఇటీవల సంభవించిన ఓ అగ్ని ప్రమాదం నుంచి మాజీ నాయకులు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ నేతల ఫొటోలకు బదులుగా తన ఇద్దరు పిల్లలను రక్షించుకున్నందుకు ఓ తల్లిని కొరియా పోలీసులు విచారిస్తున్నారు. ఆమె నేరం రుజువైతే పది నుంచి 15 ఏళ్ల పాట కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ కఠినం అంటే జైల్లో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.
ఉత్తర హ్యామాగ్యాంగ్ రాష్ట్రంలోని ఆన్‌సంగ్ కౌంటీలో ఒకే ఇంటిలో రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇటీవల ఓ పోర్షన్‌లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఇరు కుటుంబాల తల్లులు బయట ఉన్నారు. అగ్ని ప్రమాదం గురించి తెల్సి, వారు ఇంట్లోకి పరుగెత్తికెళ్లి తమ పిల్లలను రక్షించుకున్నారు. ఈ లోగా ఇద్దరు పిల్లలున్న ఓ తల్లి ఉంటున్న పోర్షన్ పూర్తిగా తగులబడి పోయింది. దాంట్లో ఉత్తర కొరియా మాజీ నేతలు కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఇల్ ఫొటోలు పూర్తిగా ఖాళీ పోయాయి. పక్క పోర్షన్‌లోని ఫొటోలు సురక్షితంగానే ఉన్నాయి.
పిల్లల ప్రాణాలను రక్షించుకున్న తల్లి, నేతల ఫొటోలను రక్షించలేక పోయినందుకు ఆమెను విచారిస్తున్నారు. ప్రస్తుతం మంటల్లో గాయపడిన పిల్లలకు వైద్యం కూడా చేయించుకోలేక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. రహస్యంగా సాయం చేస్తామని ఇరుగు పొరుగు వారు వచ్చినా పోలీసులకు భయపడి ఆమె సాయం నిరాకరిస్తోంది. ఉత్తరకొరియా నిబంధనల ప్రకారం ప్రతి కుటుంబం విధిగా ఈ ఇద్దరు కొరియా నేతల ఫొటోలను ఇంట్లో పెట్టుకోవాలి. అదీ ఏదో గదిలో కాదు, లివింగ్ రూమ్‌లో. ప్రముఖంగా కనిపించే చోట వాటిని ప్రదర్శించాలి. పక్కన, కింద వారున్న గ్రూపు ఫొటోలు తప్పా, ఇతరుల ఫొటోలు పెట్టరాదు. పైగా ఆ ఫొటోలు ఇంట్లో ఉంటున్న వారి తలలకన్నా ఎత్తులో ఉండాలి. అందరికన్నా వారు పెద్ద వారు అనే అర్థంలో ఈ నిబంధన.
వారి ఫొటోలు ఉన్నాయా, లేవా అన్న విషయాన్ని అప్పుడప్పుడు పోలీసు ఇన్‌స్పెక్టర్లు ఇంటింటికి వచ్చి తనిఖీ చేస్తారు. ఆ ఫొటోలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దుమ్ము పట్టనీయరాదు. దుమ్ము పేరుకుంటే దాని స్థాయినిబట్టి జరిమానా విధిస్తారు. ఫొటోలను ప్రాణపదంగా చూసుకోవాలి. ఇద్దరు పిల్లలను రక్షించుకునే తొందరలో ఓ తల్లి వారి ఫొటోలను రక్షించడం మరచిపోవడంతోనే ఇప్పుడామెకు చిక్కులు. గతంలో ప్యాంగ్యాంగ్‌ను సందర్శించిన అమెరికా విద్యార్థి అట్టో వాంబియర్ కిమ్ ఇల్ సంగ్ పేరున్న ఓ పోస్టర్‌ను చించి వేసినందుకు 15 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
లివింగ్ రూమ్‌లో ఈ నేతల ఫొటోలను అమర్చే గోడను ‘హానర్ వాల్’ అని పిలుస్తారని ఇప్పటి వరకు ఆరుసార్లు ఉత్తర కొరియా వెళ్లి వచ్చిన అమెరికాలోని ఇలినాయికి చెందిన రే చున్నింగమ్ అనే అధికారి తెలిపారు. ప్రాణాలకు తెగించి అగ్ని ప్రమాదాలు, వరదల నుంచి ఈ నేతల ఫొటోలను రక్షించిన వారిని హీరోలుగా ప్రశంసించడంతోపాటు అవార్డులతో అక్కడి ప్రభుత్వం సన్మానిస్తుంది. ముఖ్యంగా చనిపోయిన సందర్భాల్లో. 2012లో ఉత్తర కొరియాలోని సిన్‌హంగ్ కౌంటీలో హాన్ హ్యాంగ్ గ్యాంగ్ అనే 14 ఏళ్ల బాలిక తన ఇంటిని వరదలు చుట్టుముట్టినప్పుడు ఈ ఇద్దరు నేతల ఫొటోలను రక్షించడంలో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆమెకు ‘కిమ్ జాంగ్ ఇల్ యువజన గౌరవ అవార్డు’ను ప్రకటించారు. ఆమె చదువుతున్న స్కూల్‌కు ఆమె పేరు పెట్టారు.
అక్కడి నిబంధనల ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, రైల్వే స్టేషన్లు, సబ్‌వే రైళ్లలో కొరియా మాజీ నేతల ఫొటోలను ప్రముఖంగా ప్రదర్శించాలి. వారి పక్కనే తన తదనంతరం తన ఫొటోను ప్రదర్శించాల్సిందిగా ప్రస్తుత సుప్రీం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. అలా ప్రకటించడం అరిష్టం అనుకున్నారేమో!?
Comments
Please login to add a commentAdd a comment