రిపబ్లికన్లతో ఒప్పందానికి ఒబామా సానుకూలత
అమెరికాలో 2.40 లక్షల మంది భారతీయులకు లబ్ధి
వాషింగ్టన్: అమెరికాలోని 2.40 లక్షల భారతీయులు సహా దాదాపు 1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు త్వరలోనే చట్టబద్ధత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వలస సంస్కరణలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సానుకూలత వ్యక్తం చేశారు. వలస చట్టాల్లో సవరణలకు సంబంధించి డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు నడుమ సైద్ధాంతిక వ్యత్యాసాలు తగ్గుతున్నాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వలస సంస్కరణలపై రిపబ్లికన్లతో మధ్యేమార్గ ఒప్పందానికి తాను సిద్ధమేనని అన్నారు. అమెరికాలో ప్రస్తుతం అక్రమంగా ఉంటున్న సుమారు 1.10 కోట్ల మంది వలసదారులకు పూర్తిస్థాయి పౌరసత్వం బదులు, వారికి చట్టబద్ధత కల్పించే ఒప్పందానికి ఆమోదం తెలపనున్నట్లు ఒబామా తొలిసారిగా సూచనప్రాయంగా చెప్పారు.
అక్రమ వలసదారులకు పూర్తిస్థాయి పౌరసత్వం బదులు వారికి చట్టబద్ధత కల్పించాలన్న ప్రతిపాదనను ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోహ్నెర్ తదితర రిపబ్లిక్ నేతలు గత గురువారం ముందుకు తెచ్చారు. కాగా, వలస సంస్కరణల విషయంలో ఇంకా కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని, అయితే, ఈ ఏడాది ఎలాగైనా వలస సంస్కరణలు ఆమోదం పొందుతాయని తాను విశ్వసిస్తున్నానని ఒబామా చెప్పారు.
‘వలసల’పై మధ్యేమార్గం!
Published Mon, Feb 3 2014 1:17 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement