అమెరికా కాల్పుల్లో కొత్త ట్విస్ట్
న్యూయార్క్: అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన కాల్పులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన ఒమర్ మతీన్ భార్యను ఈ కేసులో విచారణకు చేరుస్తున్నారు. ఆమెకు ఈ దాడి గురించి ముందే తెలిసి ఉంటుందని అమెరికా లా ఎన్ ఫోర్స్మెంట్ విభాగం అనుమానిస్తోంది. ఎందుకంటే దాడులు జరిగిన గే క్లబ్బుకు ఒమర్ మతీన్ ను ఆమె స్వయంగా అంతకుముందు పలుమార్లు తీసుకొని వెళ్లిందంట. అంతేకాదు.. ఈదాడికి వారం ముందు ఆమె పలు చోట్లకు అతడితోపాటు వెళ్లిందని, అలా ఇద్దరు వెళ్లిన సమయంలోనే దాడికి కావాల్సిన ఆయుధాలను మతీన్ సమర్చుకూర్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెకు ఈ దాడి గురించి తెలుసన్న కారణాలతో ఒమర్ భార్య అయిన నూర్ మతీన్ను త్వరలోనే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. దాడులు జరిగిన వెంటనే ఆమెను ఈ కేసుకు సంబంధించి తొలుత ప్రశ్నించిన సమయంలో కూడా దాడితో సంబంధం లేని విషయాలు అనుమానాస్పదంగా చెప్పిందట. ఓర్లాండోలోని ఓ గేల నైట్ క్లబ్బుపై ఒమర్ దాడికి పాల్పడి 49మందిని దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరో 50మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి చరిత్రగా మిగిలిపోయింది. కాగా, ఒమర్ కు బయటనుంచి ఆదేశాలు రాలేదని, తానే ఉగ్రవాద భావజాల ప్రేరేపితుడై ఈ దారుణానికి దిగాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా చెప్పారు. అయితే, ఇంతపెద్ద దాడి వెనుక భారీ కుట్రే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఇప్పుడు కూపీలాగే క్రమంలో అతడి భార్యను అదుపులోకి తీసుకోనున్నారు.