'16 సార్లు ఫోన్ చేశాడు'
వాషింగ్టన్: అమెరికాలోని ఆర్లెండో నైట్ క్లబ్ లో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతిని అసహ్యించుకుంటూ ఫేస్బుక్ లో పుంఖాను పుంఖాలుగా అతడు రాతలు రాశాడు. కాల్పులకు ముందు, కాల్పుల సమయంలోనూ అతడు ఫేస్బుక్ లో పోస్ట్ లు పెట్టాడని భద్రత, ప్రభుత్వ వ్యవహారాల సెనెట్ కమిటీ చైర్మన్, సెనేటర్ రాన్ జాన్సన్ వెల్లడించారు.
ఆదివారం తెల్లవాజామున ఆర్లెండో నైట్ క్లబ్ లో కాల్పులు జరపడానికి ముందు మతీన్ 16 ఫోన్ కాల్స్ చేశాడని తెలిపారు. 911 నంబర్ కు మూడు సార్లు, స్థానిక టీవీ చానల్ కు ఒకసారి ఫోన్ చేశాడని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్ బర్గ్ కు లేఖ రాశారు. ఫేస్బుక్ లో మతీన్ రాతలను బట్టి అతడు ఎలాంటి వాడో తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసుల్లో గతంలోనూ ఫేస్బుక్ సహరించిందని గుర్తు చేశారు. ఫేస్బుక్ ను టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, కమిటీ విచారణకు సహకరించాలని జాన్సన్ కోరారు.
తమ దగ్గరున్న సమాచారం ప్రకారం 5 ఫేస్బుక్ ఖాతాలున్నాయని చెప్పారు. జూన్ 12న అతడు పల్స్ ఆర్లెండో, షూటింగ్ అనే పదాలతో ఇంటర్నెట్ లో వెతికాడని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా, రష్యా దాడులు ఆపాలని అతడు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడని తెలిపారు. నిజమైన ముస్లిం పాశ్చాత్య విధానాలను అంగీకరించడని రాశాడని వెల్లడించారు.