Omar Mateen
-
మరో వీడియో విడుదల చేసిన ఐసిస్
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరో వీడియో విడుదల చేసింది. వీడియోలో కనిపించిన వ్యక్తి అమెరికన్ ఐసిస్ ఫైటర్నంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ.. ఆర్లాండో గే నైట్ క్లబ్‌పై దాడి చేసిన ఒమర్ మతీన్‌ను ప్రశంసించాడు. అమెరికాలో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఆర్లాండోలో దాడి జరిగిన వారం రోజుల తర్వాత ఐసిస్ ఆదివారం ఈ వీడియోను ఇరాక్‌లో విడుదల చేసింది. ఆర్లాండో గే నైట్ క్లబ్లో అఫ్ఘానిస్తాన్ సంతతికి చెందిన ఒమర్ జరిపిన కాల్పుల్లో 49 మంది మరణించగా, మరో 53 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్ వెంటనే ప్రకటించింది. అయితే ఐసిస్ ఆదేశాల మేరకు ఒమర్ ఈ దాడి చేయలేదని, ఈ ఉగ్రవాద సంస్థ ప్రభావంతో కాల్పులు జరిపాడని అధికారులు చెప్పారు. ఐసిస్ విడుదల చేసిన వీడియోలో అమెరికన్ ఫైటర్‌తో పాటు ఫ్రాన్స్, ఇండోనేసియా, రష్యా, ఉజ్బెక్ దేశాలకు చెందిన ఉగ్రవాదులు కనిపిస్తారు. వీడియోలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫొటో ఓ వైపు, మరో వైపు ఒమర్ ఫొటోలు కనిపిస్తాయి. ఆర్లాండో దాడి దృశ్యాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. -
'16 సార్లు ఫోన్ చేశాడు'
వాషింగ్టన్: అమెరికాలోని ఆర్లెండో నైట్ క్లబ్ లో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్ కు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతిని అసహ్యించుకుంటూ ఫేస్బుక్ లో పుంఖాను పుంఖాలుగా అతడు రాతలు రాశాడు. కాల్పులకు ముందు, కాల్పుల సమయంలోనూ అతడు ఫేస్బుక్ లో పోస్ట్ లు పెట్టాడని భద్రత, ప్రభుత్వ వ్యవహారాల సెనెట్ కమిటీ చైర్మన్, సెనేటర్ రాన్ జాన్సన్ వెల్లడించారు. ఆదివారం తెల్లవాజామున ఆర్లెండో నైట్ క్లబ్ లో కాల్పులు జరపడానికి ముందు మతీన్ 16 ఫోన్ కాల్స్ చేశాడని తెలిపారు. 911 నంబర్ కు మూడు సార్లు, స్థానిక టీవీ చానల్ కు ఒకసారి ఫోన్ చేశాడని చెప్పారు. ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్గ్ జుకర్ బర్గ్ కు లేఖ రాశారు. ఫేస్బుక్ లో మతీన్ రాతలను బట్టి అతడు ఎలాంటి వాడో తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసుల్లో గతంలోనూ ఫేస్బుక్ సహరించిందని గుర్తు చేశారు. ఫేస్బుక్ ను టార్గెట్ చేయాలన్న ఉద్దేశం తమకు లేదని, కమిటీ విచారణకు సహకరించాలని జాన్సన్ కోరారు. తమ దగ్గరున్న సమాచారం ప్రకారం 5 ఫేస్బుక్ ఖాతాలున్నాయని చెప్పారు. జూన్ 12న అతడు పల్స్ ఆర్లెండో, షూటింగ్ అనే పదాలతో ఇంటర్నెట్ లో వెతికాడని వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ పై అమెరికా, రష్యా దాడులు ఆపాలని అతడు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడని తెలిపారు. నిజమైన ముస్లిం పాశ్చాత్య విధానాలను అంగీకరించడని రాశాడని వెల్లడించారు. -
అమెరికా కాల్పుల్లో కొత్త ట్విస్ట్
న్యూయార్క్: అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన కాల్పులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దారుణానికి పాల్పడిన ఒమర్ మతీన్ భార్యను ఈ కేసులో విచారణకు చేరుస్తున్నారు. ఆమెకు ఈ దాడి గురించి ముందే తెలిసి ఉంటుందని అమెరికా లా ఎన్ ఫోర్స్మెంట్ విభాగం అనుమానిస్తోంది. ఎందుకంటే దాడులు జరిగిన గే క్లబ్బుకు ఒమర్ మతీన్ ను ఆమె స్వయంగా అంతకుముందు పలుమార్లు తీసుకొని వెళ్లిందంట. అంతేకాదు.. ఈదాడికి వారం ముందు ఆమె పలు చోట్లకు అతడితోపాటు వెళ్లిందని, అలా ఇద్దరు వెళ్లిన సమయంలోనే దాడికి కావాల్సిన ఆయుధాలను మతీన్ సమర్చుకూర్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ దాడి గురించి తెలుసన్న కారణాలతో ఒమర్ భార్య అయిన నూర్ మతీన్‌ను త్వరలోనే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. దాడులు జరిగిన వెంటనే ఆమెను ఈ కేసుకు సంబంధించి తొలుత ప్రశ్నించిన సమయంలో కూడా దాడితో సంబంధం లేని విషయాలు అనుమానాస్పదంగా చెప్పిందట. ఓర్లాండోలోని ఓ గేల నైట్ క్లబ్బుపై ఒమర్ దాడికి పాల్పడి 49మందిని దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. మరో 50మందికి పైగా గాయాలపాలయ్యారు కూడా. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి చరిత్రగా మిగిలిపోయింది. కాగా, ఒమర్ కు బయటనుంచి ఆదేశాలు రాలేదని, తానే ఉగ్రవాద భావజాల ప్రేరేపితుడై ఈ దారుణానికి దిగాడని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా చెప్పారు. అయితే, ఇంతపెద్ద దాడి వెనుక భారీ కుట్రే ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు ఇప్పుడు కూపీలాగే క్రమంలో అతడి భార్యను అదుపులోకి తీసుకోనున్నారు. -
అమెరికాలో మళ్లీ కాల్పులు!
అమారిలో: ఆర్లెండోలోని నైట్ క్లబ్బులో జరిగిన దారుణమైన కాల్పుల ఉదంతం మరువకముందే మళ్లీ అమెరికాలో కాల్పుల మోత మోగినట్టు తెలుస్తోంది. టెక్సాస్ అమారిలోలోని వాల్‌మార్ట్ వద్ద ఓ సాయుధుడు కాల్పులతో కలకలం రేపాడు. సాయుధుడి చేతిలో పలువురు బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లడం మానుకోవాలని, ట్రాఫిక్ మీద దృష్టి పెట్టడం కన్నా సంఘటన స్థలంలో పరిస్థితులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాలని అమారిలో పోలీసు విభాగం సూచించింది. వాల్‌మార్ట్ స్టోర్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి తుపాకులతో వీరంగానికి దిగినట్టు తెలుస్తున్నదని స్థానిక మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఎవరూ కాల్పుల బారిన పడలేదని, కాల్పుల వల్ల ఎవరు గాయపడ్డట్టు సమాచారం లేదని అమారిలో పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు వాల్‌మార్ట్ స్టోర్‌లోకి ప్రవేశించారని, ప్రస్తుతం అక్కడ కాల్పులు కొనసాగడం లేదని వెల్లడించారు. సాయుధుడి ఆధీనంలో ఉన్న బందీలంతా సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఆర్లెండోలోని ఓ గే నైట్‌క్లబ్బులో రెండ్రోజుల కిందట ఓమర్ మతీన్ ఉన్మాదీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. పల్స్ క్లబ్బులో పార్టీలో మునిగితేలిన యువకులపై అతడు విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. 49మందిని పొట్టనబెట్టుకున్నాడు. దేశీయ ఉగ్రవాదమే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగానే టెక్సాస్‌లోని అమారిలోలో కాల్పులు చోటుచేసుకోవడం అమెరికన్లు దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. -
గే ముద్దులే ఘన నివాళి..
ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లో ఆదివారం చోటుచేసుకున్న కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన 49 మందిని పోలీసులు గుర్తించారు. పరిమిత వైశాల్యంలోని ఓ గదిలో పార్టీ చేసుకుంటున్న 300 మందిపై దుండగుడు మతిన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబ్డ సంగతి తెలిసిందే. దుండగుణ్ని మట్టుపెట్టిన అనంతరం లోపలికి వెళ్లిన పోలీసులు అక్కడి దృశ్యాలు చూసి గగుర్పాటుకు గురయ్యారు. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల్లో కొందరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. మృతదేహాలను ఆసుపత్రికి చేర్చిన పోలీసులు వాటిని గుర్తించే ప్రక్రియను సోమవారానికి పూర్తిచేశారు. చనిపోయిన వారిలో విద్యార్థులు, నర్సులు, డ్యాన్సర్లు, పెళ్లయినవాళ్లు తదితరులున్నట్లు ఆర్లెండో పోలీసులు తెలిపారు. కాగా, చనిపోయిన 49 మంది గే నైట్ క్లబ్ సభ్యులకు.. మగ- మగ ముద్దుల ఫొటోల ద్వారా నెటిజన్లు ఘన నివాళులు అర్పించారు. 'మగ- మగ ముద్దులు పెట్టుకోవడం చూడలేకే నా కొడుకు ఈ పని చేసి ఉంటాడు' ఆర్లెండో నరమేధం అనంతరం దుండగుడు ఒమర్ మతిన్ తండ్రి చేసిన వ్యాఖ్య. సమాజంలోని పలు వర్గాలు ఆయన వ్యాఖ్యలను ఖండించగా, ఎల్జీబీటీలు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించారు. 'నైట్ క్లబ్ లో ప్రాణాలు కోల్పోయిన 49 మంది సహోదరులకు ఇదే మా ఘన నివాళి' అంటూ సోషల్ మీడియాలో మగ- మగ ముద్దు పెట్టుకుంటున్న ఫొటోలను పెద్ద ఎత్తున పోస్ట్ చేశారు. సోమవారం ట్విట్టర్ లో #TwoMenKissing విపరీతంగా ట్రేడ్ అయింది. ఒకేసారి దాదాపు 1000 మంది #TwoMenKissing లో చర్చించుకుని ఫేస్ బుక్ చర్చల రికార్డును బద్దలు కొట్టారు. తమ గే పార్ట్ నర్ ను ముద్దు పెట్టుకుంటూ ఫొటోలు పెట్టినవారిలో ప్రముఖుల దగ్గర్నుంచి సామాన్యుల వరకు ఉన్నారు. Two men kissing. ❤️ pic.twitter.com/XSzQry1x4Q — Shadi Petosky (@shadipetosky) June 12, 2016 -
ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వణుకు
ఆర్లాండో మారణకాండతో.. అమెరికాలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి వెన్నులో వణుకు పుడుతోంది. ఎప్పుడు ఎవరొచ్చి తుపాకులతో మీద పడతారోనని భయం భయంగా గడుపుతున్నారు. అసలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్లాండో దారుణ మారణకాండకు కారణమైన ఉన్మాది ఒమర్ మతీన్‌ను ప్రేరేపించిన అంశం ఏమిటి? మతీన్ ఎన్నడూ ముస్లిం కమ్యూనిటీలో పెరగకపోవడం, ఆయనకు ఇస్లాం టెర్రరిస్టులతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో మతీన్‌ను ఉన్మాదిగా మార్చిన అంశం ఏమిటన్న దానిపైనే ప్రధానంగా అమెరికా దర్యాప్తు అధికారులు తమ దృష్టిని కేంద్రీకరించారు. ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసి కొన్నాళ్ల క్రితం మతీన్ డిస్టర్బ్ అయ్యాడని, ఇద్దరు మగవాళ్లు ముద్దు పెట్టుకోవడం ఏంటంటూ తనతో చాలాసేపు వాదన కూడా పెట్టుకున్నాడని మతీన్ తండ్రి ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. మతీన్‌ను ఉన్మాదిగా మార్చిన అంశం ఏమిటన్నది స్పష్టంగా తేలకపోయినా, ఎల్జీబీటీక్యూ (లెస్బేనియన్లు, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, కీర్) సంస్కృతిలో భాగంగా అవతరించిన నైట్ క్లబ్ లక్ష్యంగా ఓ ఉన్మాది దాడి చేయడం అంటేనే ఈ సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించే స్వభావంతో మతీన్ దాడికి పాల్పడి ఉంటాడని మానసిక నిపుణులు భావిస్తున్నారు. ఈ వాదనతో విభేదిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంతోకాలంగా ఫ్లోరిడా రాష్ట్రంలో నివసిస్తున్న మతీన్‌కు ఎల్జీబీటీక్యూ ఉద్యమం గురించి మొదటి నుంచి తెలిసే ఉంటుందని, దేశంలో గే పెళ్లిళ్లను అనుమతించే వరకు సాగిన ఉద్యమం గురించి అవగాహన ఉన్న మతీన్ ఈ కారణంగా ఇంత దారుణానికి ఒడిగట్టే ప్రయత్నం చేయడని మరికొంత మంది వాదన. మతీన్ దాడికి ముందే పోలీసులకు ఫోన్ చేసి తాను ఇస్లాం రాజ్యం కోసం ప్రతిజ్ఞ చేస్తున్నానని చెప్పడం వల్ల ఇస్లాం టెర్రరిస్టులతో అతడికి సంబంధం ఉండి ఉంటుందని పోలీసు అధికారులు ముందుగా భావించారు. కానీ అతడికి వారితో ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇస్లాం రాజ్యాన్ని కోరుకుంటున్న ఐఎస్ లాంటి టెర్రరిస్టు సంస్థలు కూడా గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇస్లాం రాజ్యం గురించి మతీన్ మాట్లాడి ఉంటాడన్నది ఓ వర్గం వాదన. అమెరికాలోని కొన్ని చర్చిలు కూడా గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎవరి వాదన ఎలా ఉన్నా ఎల్జీబీటీక్యూ కార్యకర్తల్లో ఈ దారుణం వణుకు పుట్టిస్తోంది. ఇక ఇలాంటి గే క్లబ్బులకు తాము వెళ్లమని కూడా గేలు చెబుతున్నారు. గే పెళ్లిళ్లను తొలుత వ్యతిరేకించిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని గే హక్కులకు ఓకే చెప్పారు. ఇప్పుడు అదే అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం గే సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన 'గే'లకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. మన దేశంలో.. భారత దేశంలో గే సంస్కృతి శిక్షార్హమైన నేరం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 377వ సెక్షన్ కింద శిక్ష విధిస్తారు. ఈ చట్టాన్ని భారత్‌లో పెద్దగా ప్రయోగించకపోయినా ఈ చట్టం కారణంగా గేలకు వ్యతిరేకంగా విద్వేషం పెరిగే ఆస్కారం ఉందన్న కారణంగా ఈ సెక్షన్ ఎత్తి వేయాలంటూ ఎప్పటి నుంచో ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. 377లోని కొన్ని క్లాజులను కొట్టివేయాలంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పును కూడా ఇచ్చింది. అయితే ఆ చట్టాన్ని కొట్టివేసే అధికారం కోర్టులకు లేదని, పార్లమెంటుకు మాత్రమే ఉందంటూ ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సెక్షన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గతేడాది ఓ బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. పార్టీలకు అతీతంగా ఆయనకు సభ్యులెవరూ మద్దతు ఇవ్వక పోవడమే అందుకు కారణం. -
మా వాడు వాళ్లను చంపాల్సింది కాదు
వాషింగ్టన్: ఫ్లోరిడాలోని గే క్లబ్లో నరమేధం సృష్టించి 50 మందిని కిరాతకంగా చంపిన ఒమర్ మతీన్ ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడు కాదని అతని తండ్రి సిద్ధిఖీ మతీన్ చెప్పాడు. తన కొడుకు నైట్ క్లబ్‌పై దాడి చేసి ఉండాల్సికాదని చెబుతూనే.. స్వలింగ సంపర్కులను దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించాడు. సిద్ధిఖీ ఇచ్చిన ఇంటర్వ్యూను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆదివారం ఆర్లెండోలోని నైట్ క్లబ్లో అఫ్ఘానిస్తాన్ సంతతికి చెందిన ఉన్మాది ఒమర్ మతీన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. గే సమాజంపై అసహ్యంతోనే తన కొడుకు దాడికి పాల్పడి ఉండొచ్చని సిద్ధిఖీ చెప్పాడు. ఈ ఘటన జరగడానికి 12 గంటల ముందు తన కొడుకు ఇంటికి వచ్చాడని, ఆ సమయంలో అతను సాధారణంగా కనిపించాడని తెలిపాడు. ఒమన్ అసహనంగా, కోపంగా ఉన్నట్టు అనిపించలేదని చెప్పాడు. నైట్ క్లబ్లో తన కొడుకు కాల్పులు జరిపాడని తెలియగానే షాక్‌కు గురయ్యాయనని పేర్కొన్నాడు. ఈ ఘటన చాలా బాధాకరమంటూ, అమెరికా ప్రజలకు సానుభూతి తెలిపాడు. -
ఆ హంతకుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు
ఓర్లాండో: ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తునే ఉన్నాయి. అతడు మంచి బాడీ బిల్డర్ అని, క్రమ శిక్షణ గల సెక్యూరిటీగార్డు అని, పోలీసు అధికారిగా ఉద్యోగం సంపాధించాలని కలలు కూడా కన్నాడని తెలిసింది. నగరంలోని మసీదులకు క్రమం తప్పకుండా ప్రార్ధనలకు కూడా వెళ్లొచ్చేవాడని అతడి తండ్రి సయ్యద్ షఫీక్ రహ్మాన్ చెప్పారు. ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మంది మృతికి ఒమర్ మతీన్ కారణమైన విషయం తెలిసిందే. అసలు ఉన్నట్లుండి అతడు ఎందుకు ఇలా చేశాడని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగా అమెరికాలోనే ఓ టాక్ షోను నిర్వహించే అతడి తండ్రి బహిరంగంగా మతీన్‌కు సంబంధించిన పలు విషయాలు చెప్పాడు. బాహాటంగానే తాలిబన్లకు మద్దతు తెలిపే ఆయన ఇప్పటికే గేలంటే తన కుమారుడికి నచ్చదనే విషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే. దాంతోపాటు తాజాగా ఈ విషయాలు ఆయన చెప్పారు. ముఖ్యంగా వారానికి నాలుగుసార్లు సాయంత్రంపూట నగరంలోని మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లేవాడని, తన పని తాను చూసుకొని వచ్చేవాడని, ఏ ఒక్కరితో కూడా మాట్లాడకపోయేవాడని అన్నారు. -
ఓర్లాండో షూటర్ భార్యను రోజూ కొట్టేవాడు!
వాషింగ్టన్: ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమైన ఒమర్ మతీన్ తనను రోజూ కొట్టేవాడని అతని మాజీ భార్య తెలిపింది. భద్రత కారణాల దృష్ట్యా తన వివరాలను వెల్లడించని ఆమె 'వాషింగ్టన్ పోస్ట్'తో మాట్లాడుతూ.. ఒమర్ మతీన్(29) తనను కారణం లేకుండానే చీటికిమాటికి కొట్టేవాడని, లాండ్రీ పని చేయలేదని కూడా కొట్టిన సందర్భాలున్నాయని తెలిపింది. అతడు బయటకు వెళ్లి ఇంటికిరాగానే కొట్టడం స్టార్ట్ చేసేవాడని వెల్లడించింది. 2009లో ఆప్ఘనిస్తాన్ సంతతికి చెందిన మతీన్‌ను ఆమె న్యూయార్క్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. వివాహం అనంతరం కొంతకాలం ఫ్లోరిడాలో మతీన్‌తో కలిసున్న ఆమె.. అతని ప్రవర్తనతో విసుగుచెంది విడాకులు తీసుకున్నట్లు సమాచారం. కాగా 'గే' కల్చర్‌కు మతీన్ తీవ్ర వ్యతిరేకి అని.. ఇటీవల ఓ ప్రదేశంలో ఇద్దరు మగవారు ముద్దుపెట్టుకుంటుండగా చూసిన మతిన్ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడని అతని తండ్రి వెల్లడించాడు. -
మగవాళ్లు ముద్దుపెట్టుకోవడం నచ్చకే!
అమెరికాలోని గే నైట్ క్లబ్బులో నరమేథం సృష్టించిన సాయుధుడి గురించి మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఫ్లోరిడా ఓర్లాండోలోని నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50మందిని పొట్టనబెట్టుకున్న సాయుధుడిని ఒమర్ మతీన్ (29)గా గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు విధేతయ ప్రకటిస్తూ అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. దారుణానికి ముందు అతడు 911 నంబర్‌కు ఫోన్ చేసి.. ఐఎస్ఐఎస్ మద్దతుగానే కాల్పుల తెగబడబోతున్నట్టు చెప్పాడని ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ నిఘా హౌస్ సెలెక్ట్ కమిటీ డెమొక్రాట్ సభ్యుడు యాడం షిఫ్ తెలిపారు. అఫ్ఘాన్ దంపతులకు జన్మించిన ఒమర్ ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని, గతంలో అతడికి ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఒమర్‌కు హోమోఫొబియా (స్వలింగ సంపర్క వ్యతిరేకత) ఉందని, అందువల్లే రంజాన్ నెలలో గే నైట్ క్లబ్బు లక్ష్యంగా అతడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఒమర్ తండ్రి మిర్ సిద్ధిఖీ ఎన్బీసీ చానెల్‌తో మాట్లాడుతూ తన కొడుకు గత నెలలో మియామిలో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకుంటుంటే చూసి చాలా ఆగ్రహానికి గురయ్యాడని, అతడి వ్యతిరేకత మత సంబంధమైనది కాదని చెప్పారు. అతడు పాల్పడిన చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంత పరిచిందని, అతడు ఇంతటి దారుణానికి పాల్పడుతాడని తాము ఊహించలేదని, ఇందుకు తాము క్షమాపణలు చెప్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా పేరొందిన ఈ ఘటన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ప్రేరేపితమేనని ప్రాథమిక దర్యాప్తులో అందిన సమాచారం బట్టి తెలుస్తోంది.