అమెరికాలోని గే నైట్ క్లబ్బులో నరమేథం సృష్టించిన సాయుధుడి గురించి మరిన్ని వివరాలు వెలుగుచూశాయి.
అమెరికాలోని గే నైట్ క్లబ్బులో నరమేథం సృష్టించిన సాయుధుడి గురించి మరిన్ని వివరాలు వెలుగుచూశాయి. ఫ్లోరిడా ఓర్లాండోలోని నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50మందిని పొట్టనబెట్టుకున్న సాయుధుడిని ఒమర్ మతీన్ (29)గా గుర్తించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు విధేతయ ప్రకటిస్తూ అతడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోందని స్థానిక పోలీసులు తెలిపారు. దారుణానికి ముందు అతడు 911 నంబర్‌కు ఫోన్ చేసి.. ఐఎస్‌ఐఎస్ మద్దతుగానే కాల్పుల తెగబడబోతున్నట్టు చెప్పాడని ప్రాథమిక దర్యాప్తును ఉటంకిస్తూ నిఘా హౌస్ సెలెక్ట్ కమిటీ డెమొక్రాట్ సభ్యుడు యాడం షిఫ్ తెలిపారు.
అఫ్ఘాన్ దంపతులకు జన్మించిన ఒమర్ ఓ సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడని, గతంలో అతడికి ఎలాంటి నేరచరిత్ర లేదని పోలీసులు తెలిపారు. ఒమర్‌కు హోమోఫొబియా (స్వలింగ సంపర్క వ్యతిరేకత) ఉందని, అందువల్లే రంజాన్ నెలలో గే నైట్ క్లబ్బు లక్ష్యంగా అతడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. ఒమర్ తండ్రి మిర్ సిద్ధిఖీ ఎన్బీసీ చానెల్‌తో మాట్లాడుతూ తన కొడుకు గత నెలలో మియామిలో ఇద్దరు పురుషులు ముద్దు పెట్టుకుంటుంటే చూసి చాలా ఆగ్రహానికి గురయ్యాడని, అతడి వ్యతిరేకత మత సంబంధమైనది కాదని చెప్పారు. అతడు పాల్పడిన చర్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంత పరిచిందని, అతడు ఇంతటి దారుణానికి పాల్పడుతాడని తాము ఊహించలేదని, ఇందుకు తాము క్షమాపణలు చెప్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో అత్యంత దారుణమైన కాల్పుల ఘటనగా పేరొందిన ఈ ఘటన ఐఎస్ఐఎస్ ఉగ్రవాద ప్రేరేపితమేనని ప్రాథమిక దర్యాప్తులో అందిన సమాచారం బట్టి తెలుస్తోంది.