ఓర్లాండోలో కాల్పులు జరిగిన నైట్ క్లబ్ ను చుట్టుముట్టిన పోలీసు వాహనాలు
అమెరికా చరిత్రలో మరో పాశవిక నరమేధం. ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని పల్స్ గే నైట్ క్లబ్ లోకి చొరబడ్డ సాయుధుడు 50 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో 53 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు పల్స్ నైట్ క్లబ్ లోకి మారణాయుధాలతో ఓ సాయుధుడు చొరబడ్డాడని, పలువురిపై కాల్పులు జరిపి, ఇంకొందరిని బందీలుగా పట్టుకున్నాడని ఓర్లాండో పోలీసులు తెలిపారు. నాలుగు గంటల ఉత్కంఠత అనంతరం పోలీసులు దుండగుణ్ని మట్టుపెట్టారు. రెండు రోజుల కిందట పాప్ సింగర్ క్రిస్టినా గ్రిమ్మీని కాల్చిచంపిన ఓర్లాండో సిటీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. (చదవండి: ఆటోగ్రాఫ్ ఇస్తుండగా సింగర్పై కాల్పులు)
గే నైట్ క్లబ్ లో కాల్పులపై స్థానిక మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా పారిపోండంటూ క్లబ్ నిర్వాహకులు కస్టమర్లకు మెసేజ్ లు పెట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఘటన తీవ్రత దృష్ట్యా క్లబ్ వద్దకు భారీగా చేకున్న పోలీసులు.. 4 గంటల తర్వాత దుండగుణ్ని అంతం చేశారు. నిందితుడు ఏ కారణంతో కాల్పులకు పాల్పడింది తెలియాల్సి ఉంది.
(చదవండి: పిచ్చి అభిమానంతోనే చంపేశాడా!)