అమెరికాలో భారీగా కాల్పుల మోత
ఫ్లోరిడా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడాలో ఓ దుండగుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఒర్లాండోని ఓ పారిశ్రామిక వాడలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కంపెనీకి చెందిన ఐదుగురు కార్మికులు చనిపోయినట్లు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ధ్రువీకరించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని బలగాలు హతం చేశాయని ఒర్లాండోని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ తెలిపారు.
ఫోర్సిత్ రోడ్డు, హ్యాంగింగ్ మాస్ రోడ్డులో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఉలిక్కిపడిన భద్రతా బలగాలు పెద్ద మొత్తంలో ఎమర్జెన్సీ వాహనాలతో కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో దారి పొడవునా వాలిపోయారు. గత ఏడాది (2016) జూన్ 12న ఇదే ఓర్లాండోలోని పల్స్ నైట్ క్లబ్బులో కాల్పులు చోటుచేసుకొని 49మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తిరిగి ఏడాది తిరగకుండానే ఇదే నెలలో అలాంటి ఘటన చోటుచేసుకోవడం అధికారులను విస్మయపరుస్తోంది.