ఆ హంతకుడు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు
ఓర్లాండో: ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తునే ఉన్నాయి. అతడు మంచి బాడీ బిల్డర్ అని, క్రమ శిక్షణ గల సెక్యూరిటీగార్డు అని, పోలీసు అధికారిగా ఉద్యోగం సంపాధించాలని కలలు కూడా కన్నాడని తెలిసింది. నగరంలోని మసీదులకు క్రమం తప్పకుండా ప్రార్ధనలకు కూడా వెళ్లొచ్చేవాడని అతడి తండ్రి సయ్యద్ షఫీక్ రహ్మాన్ చెప్పారు. ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మంది మృతికి ఒమర్ మతీన్ కారణమైన విషయం తెలిసిందే.
అసలు ఉన్నట్లుండి అతడు ఎందుకు ఇలా చేశాడని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుండగా అమెరికాలోనే ఓ టాక్ షోను నిర్వహించే అతడి తండ్రి బహిరంగంగా మతీన్కు సంబంధించిన పలు విషయాలు చెప్పాడు. బాహాటంగానే తాలిబన్లకు మద్దతు తెలిపే ఆయన ఇప్పటికే గేలంటే తన కుమారుడికి నచ్చదనే విషయాన్ని చెప్పిన విషయం తెలిసిందే. దాంతోపాటు తాజాగా ఈ విషయాలు ఆయన చెప్పారు. ముఖ్యంగా వారానికి నాలుగుసార్లు సాయంత్రంపూట నగరంలోని మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లేవాడని, తన పని తాను చూసుకొని వచ్చేవాడని, ఏ ఒక్కరితో కూడా మాట్లాడకపోయేవాడని అన్నారు.