హంతకుడు తన ఆయుధాలను ఇలా సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్ట్ చేశాడు, హంతకుడు రామోస్
హూస్టన్: హంతకుడు రామోస్ ఫేస్‌బుక్‌లో ముందుగా ప్రకటించి మరీ నరమేధానికి పాల్పడ్డాడు! ‘నానమ్మను కాల్చబోతున్నా’ అని మంగళవారం 11 గంటలప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆమెను కాల్చాక, ‘ఇప్పుడు స్కూల్‌లో షూటౌట్‌కు బయల్దేరుతున్నా’’ అంటూ మరో పోస్ట్ చేశాడు. అరగంటకే దారుణానికి తెగబడ్డాడు. దీనిపై ఉదయం నుంచీ పలు సంకేతాలిస్తూ వచ్చాడు. ‘ఓ చిన్న రహస్యం చెప్పాలనుకుంటున్నా’ అంటూ లాస్‌ఏంజెలెస్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రాంలో మంగళవారం ఉదయమే మెసేజ్ చేశాడు.
‘‘ఇంకాసేపట్లో నేను...’’ అంటూ 9.16కు ఓ స్మైలీ ఎమోజీ పెట్టాడు. ‘‘11 గంటల లోపు చెప్తా’’ అంటూ ముగించాడు. 11.30కు నరమేధం సృష్టించాడు. తన టిక్‌టాక్ పేజీ పరిచయంలో ‘పిల్లలూ! నిజ జీవితంలో కూడా భయపడేందుకు రెడీగా ఉండండి’’ అని కూడా రాసుకున్నాడు! కాల్పులకు వాడిన తుపాకులను, మేగజైన్లను రామోస్ తన 18వ పుట్టిన రోజు సందర్భంగా గత వారమే కొన్నాడు. వాటితో పోజిస్తూ ఫొటోలు దిగడమే గాక ఇన్‌స్టాగ్రాంలో అప్‌లోడ్ చేశాడు. టెక్సాస్‌లో 18 ఏళ్లు నిండితే లైసెన్సుతో పని లేకుండా తుపాకులు కొనుక్కోవచ్చు.
నానమ్మతో నిత్యం గొడవలే
డిగ్రీ చదవలేకపోయానంటూ రామోస్ నిత్యం బాధపడేవాడని పొరుగువారు చెప్పారు. ఈ విషయమై నిత్యం నానమ్మతో గొడవ కూడా పడేవాడన్నారు. స్థానిక విండీస్ సరుకుల దుకాణంలో పని చేసే అతనిది దూకుడు మనస్తత్వమని సహోద్యోగులు చెబుతున్నారు. ‘‘ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. మహిళా ఉద్యోగులకు అసభ్య మెసేజీలు పంపేవాడు. వాళ్లతో చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. స్థానిక పార్కులో పలువురితో బాక్సింగ్ చేసేవాడు’’ అన్నారు. అతనికి తల్లితోనూ సరిపడేది కాదని, అందుకే కొద్ది నెలల క్రితమే నానమ్మ ఇంటికి వచ్చాడని చెప్పారు. రామోస్ స్కూల్ మేట్స్ సోమవారం డిగ్రీ పూర్తి చేసి పట్టాలు తీసుకున్నారని సమాచారం. ఆ ఆక్రోశంతోనే దారుణానికి ఒడిగట్టాడని భావిస్తున్నారు. నానమ్మపై కాల్పులు జరిపి, ‘నన్ను కాల్చేస్తున్నాడు’ అని ఆమె అరుస్తుండగానే కారెక్కి స్కూలుకేసి దూసుకెళ్లాడు.
నత్తితో బాధపడేవాడు
రామోస్‌కు నత్తి ఉండేదని, దాంతో బాల్యంలో స్కూళ్లో తోటి పిల్లల చేతిలో చాలా అవమానాలకు గురయ్యాడని అతని సహ విద్యార్థి చెప్పాడు. ‘‘రామోస్ నత్తిని, అతను వేసుకునే నాసిరకం బట్టలను పిల్లలంతా బాగా వెక్కిరించేవారు. అతని పేదరికాన్ని కూడా హేళన చేసేవారు. చూట్టానికి గే మాదిరిగా కన్పిస్తున్నావంటూ ఆటపట్టించేవారు. అది భరించలేక అతను స్కూలు ఎగ్గొట్టేవాడు. చివరికి మొత్తానికే మానేశాడు’’ అని చెప్పుకొచ్చాడు. తర్వాత షూటింగ్ అంటే ఇష్టం పెంచుకున్నాడని, కాల్ ఆఫ్ డ్యూటీ అనే ఫైటింగ్ గేమ్‌కు వీరాభిమానిగా మారాడని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment