'మమ్మల్ని టార్గెట్ చేశారో.. మీరుండరు'
వాషింగ్టన్: తమతో పెట్టుకుంటే నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను హెచ్చరించారు. 'మేం ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మా దేశంగానీ, మా దేశంతో సంబంధాలు ఉన్న ఇతర దేశాలుగానీ మీ టార్గెట్ అయితే.. అది మీకు ఎప్పటికీ సురక్షితం కాదు. పూర్తిగా పెకలించేస్తాం' అని ఒబామా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ రక్షణశాఖ బృందంతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే ఐఎస్ తన ప్రాబల్యం ఉన్న ఇరాక్, సిరియాలో అంతరించి పోతుందని, ఆ సంస్థకు చెందిన టాప్ 120మంది నేతలను, కమాండర్లను హతం చేశామని.. ఇది మున్ముందు కూడా కొనసాగుతుందని చెప్పారు. ఇక ఐఎస్ను అసలు లేకుండా చేయడమే తమ అసలైన పని అని.. మున్ముందు మరింత వేగంగా పనిచేస్తామని చెప్పారు. ఇరాక్, సిరియా సేనలతో కలిసి మూకుమ్మడి దాడులు కొనసాగుతాయని చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ కు ప్రధాన ఆదాయ వనరులు ఇంధనం అమ్మకాలు అని, అదే వారికి కోట్లలో ఆదాయాన్ని ఇస్తూ వారికి ఆయుధాలు సమకూర్చుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక నుంచి అలాంటి క్షేత్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసి వారిని ఆర్థికంగా బలహీనపరుస్తామని, ఆహార సౌకర్యాలు వంటివి కూడా లేకుండా చేస్తామని చెప్పారు. ఇతర దేశాలకుచెందిన ఫైటర్లు సైతం వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ను ధ్వంసం చేసే పనుల్లో మునిగిపోవడం సంతోషంగా ఉందని చెప్పారు.