'ఇరాక్పై చేసినట్లు సిరియాలో చేయం'
వాషింగ్టన్: సిరియాపై ప్రస్తుతం చేస్తున్న దాడులు గతంలో ఇరాక్పై చేపట్టిన చర్య వంటివి కాదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్పై పోరాడేందుకు అమెరికా నుంచి ఎక్కువ బలగాలను పంపడం.. కేవలం మిలిటెంట్ గ్రూప్ ఐఎస్ వర్గాన్ని నాశనం చేయడానికేనని ఆయన స్పష్టం చేశారు. సిరియాలో 14, ఇరాక్లో 18 యుద్ధ విమానాల ద్వారా పోరాటం సాగిస్తున్నట్లు ఒబామా తెలిపారు. 2003లో ఇరాక్పై తాము చేసిన దాడికి ప్రస్తుత చర్యలకు చాలా వ్యత్యాసం ఉందని ఒబామా వ్యాఖ్యానించారు. కేవలం ఇరాక్లోని ఇస్లామిక్ మిలిటెంట్లపై పోరాడటమే తమ ప్రస్తుత కర్తవ్యమన్నారు.
సిరియాలోని చాలా ప్రాంతాల్లో గగనతలం నుంచి తమ దాడులు ముమ్మరం చేస్తున్నామని ఒబామా వివరించారు. డేయిర్ అజ జ్వార్ సమీపంలో ఆరు యుద్ద విమానాలు, అబు కమాల్ వద్ద మూడు యుద్ద విమానాలు దాడులు కొనసాగిస్తున్నాయని ఆయన తెలిపారు. కాగా బ్రిటన్ కూడా గురువారం నాడు తమ సేనల్ని పంపి సిరియాలో మిలిటెంట్లపై దాడి ప్రారంభించింది. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టర్కీని నిందించడం ప్రపంచదేశాల మధ్య సమైక్యత లోపాన్ని రుజువు చేస్తుంది. ఇస్లామిక్ వర్గానికి విరాళాలు అందజేస్తున్న ఆయిల్ బావుల క్షేత్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది.