ఇస్లాం వ్యతిరేకులను తిరస్కరించండి
ఐరాస సదస్సులో ముస్లింలకు ఒబామా పిలుపు
న్యూయార్క్ : ఐఎస్‌ఐఎస్, అల్ కాయిదా వంటి ఉగ్రవాద సంస్థలను కూకటి వేళ్లతో సహా పెకలించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఇస్లాంను వక్రీకరించే వారిని, హింసను ప్రోత్సహించేవారిని ప్రపంచ ముస్లింలు తిరస్కరించాలన్నారు. ‘ఒక ఉగ్రవాద సంస్థ తాను బందీలుగా పట్టుకున్న వారి తలలు నరికేయటం.. అమాయకులను, మహిళలను ఊచకోత కోయడం ఒక దేశ సమస్య కాదు.. ఇది మానవత్వంపై జరుగుతున్న దాడి’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ భేటీలో సోమవారం వార్షిక ఉపన్యాసం చేసిన ఒబామా ఉగ్రవాదులకు ప్రపంచంలో చోటు లేదని స్పష్టం చేశారు.
ఇరాక్, సిరియాలలో కిరాతకమైన యుద్ధ పద్ధతులపై ఆధారపడి ఐఎస్‌ఐఎస్ మనుగడ సాగిస్తోందని, ఇది ఇస్లాం భావజాలాన్ని విషపూరితం చేస్తోందని అన్నారు. తీవ్రవాదంపై కలసికట్టుగా పోరాడాలన్నారు. సిరియాలో అంతర్యుద్ధానికి అంతం పలకటానికి అవసరమైతే రష్యా, ఇరాన్‌లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ‘మనం అంతా కలిసికట్టుగా పనిచేయకపోతే.. రేపు జరగబోయే పరిణామాలకు అందరం ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది’ అని హెచ్చరించారు.
‘సిరియాలో సుదీర్ఘంగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి అంతం పలకటానికి ఏ దేశంతోనైనా కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. అయితే ఇందు కోసం తీసుకునే ఏ తీర్మానమైనా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పదవీచ్యుతికి అనుకూలంగా ఉండాలి. ఇక అక్కడ రక్తపాతం జరగరాదు, ఊచకోతలు ఆగిపోవాలి.. యుద్ధానికి ముందున్న పరిస్థితులు మళ్లీ నెలకొనాలి’ అని వివరించారు. ఉక్రెయిన్‌లో వేర్పాటువాదులకు రష్యా చేసిన సాయం ఆ దేశాన్నే దెబ్బకొట్టిందన్నారు. తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. సిరియాకు ఆయుధాల సరఫరాను సమర్థించుకున్నారు.
శాంతిరక్షణలో భాగస్వామ్యం.. భారత్‌తో సహా ప్రపంచ శాంతిపరిరక్షణకు పనిచేసే 50 దేశాలతో భాగం పంచుకుంటామని ఒబామా తెలిపారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతిపరిరక్షణ సదస్సులో ఒబామా, మోదీ ప్రసంగించనున్నారు. కాగా, మహిళలకు 2030 నాటికల్లా సమానత్వం కల్పించేందుకు నిధులు సమాకూరుస్తామని పలు దేశాలు ఐరాస భేటీ సందర్భంగా చెప్పాయి.