మానవత్వానికి ఐసిస్ ప్రమాదకారి
ఐసిస్ అధినేత అబద్ధాలకోరు: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : మానవత్వానికి ఐసిస్ అత్యంత ప్రమాదకారి అని మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సౌదీలోని మదీనా మసీద్‌పై ఐసిస్ జరిపిన మానవబాంబు దాడికి వ్యతిరేకంగా శుక్రవారం అర్ధరాత్రి ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేవలం ముస్లింలకే కాదు, ప్రపంచ మానవాళికే ఐసిస్ ప్రమాదకరంగా మారనుందన్నారు. ముస్లింల ముసుగులో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఐసిస్‌తో ఇస్లాంకు సంబంధం లేదన్నారు. దాని అధినేత అబూబకర్ పచ్చి అబద్ధాలకోరని, ఇస్లాం పేరుతో ఇస్లాంను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. సజీవంగా కనిపిస్తే ముస్లింలు అతణ్ని వంద ముక్కలు చేయడం ఖాయమని హెచ్చరించారు. మదీనాపై ఉగ్రదాడి పెద్ద నేరమని, అది యావత్ ముస్లింలపై జరిగిన దాడని, ఇలాంటి దాడులను సహించేది లేదని అన్నారు.ఐసిస్ అంతం తప్పదని, దాని కోసం ముస్లింలు ఐక్యం కావల్సిన అవసరం ఉందన్నారు.
ముస్లింలపై దుష్ర్పచారం...
బీజేపీ, సంఘ్‌పరివార్‌లు హిందుస్థాన్ ముస్లింలపై దుష్ర్పచారానికి పాల్పడుతున్నాయని అసదుద్దీన్ ఆరోపించారు. ఉగ్రదాడి అనగానే ముస్లింలను అనుమానిస్తున్నారని, అలా అనుమానించవద్దని విజ్ఞిప్తి చేశారు. ఇస్లాంకు ఐసిస్, సెక్యులరిజానికి సంఘ్‌పరివార్ శత్రువులన్నారు. ముస్లిం యువత సామాజిక మాధ్యమాల్లో సంఘ విద్రోహ అంశాలపై స్పందించవద్దన్నారు. కార్యక్రమంలో మౌలానాలు ముఫ్తీ ఖలీల్ అహ్మద్, సయ్యద్ మహ్మద్ ఖుబుల్ పాషా, యునెటైడ్ ముస్లిం ఫోరం కార్యదర్శి రహీమొద్దీన్ అన్సారీ పాల్గొన్నారు.