'ఐఎస్పై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదు'
వాషింగ్టన్: ప్రపంచంలో అమెరికానే అత్యంత శక్తిమంతమైన దేశమని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దేశంలో పెరిగిపోతున్న తుపాకీ హింస నుంచి మన పిల్లలను రక్షించుకుందామని అమెరికన్లకు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తికాబోతున్న నేపథ్యంలో ఒబామా.. చివరిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్ గురించి ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఆర్థికాభివృద్ధి, భద్రత, రాజకీయాలు, ఉగ్రవాదులపై చర్యలు తదితర అంశాల గురించి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే..
- సామాజిక భద్రత, ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం. ఈ విషయాలను విస్మరించకుండా, అమలు చేయాలి
- ప్రతి అమెరికన్ ఉన్నత విద్య అభ్యసించేలా కాలేజీలను అందుబాటులో ఉంచాలి
- మన పిల్లల కోసం మరింతమంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి, వారికి మద్దతుగా నిలవాలి
- గత ఏడేళ్లుగా ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పనిచేశాం, ఇది సత్ఫలితాలను ఇచ్చింది.
- పదవి నుంచి వైదొలిగినా మరో ఐదు, పదేళ్ల పాటు మన భవిష్యత్పై దృష్టి పెడతా
- దేశంలో ప్రతి ఒక్కరికీ తాను ప్రేమించినవారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
- మీపై నమ్మకముంది, మార్పుపై నమ్మకముంది
- ప్రజలను లక్ష్యంగా చేసుకునే రాజకీయాలను తిరస్కరించాలి
- ముస్లింలను విమర్శించడం వల్ల, మసీదును ధ్వంసం చేయడం వల్ల మనం సురక్షితంగా ఉండలేము
- అమెరికా చిత్తశుద్ధిపై కానీ నాపై కానీ సందేహం ఉంటే.. న్యాయం జరిగింది చూడండి. కావాలంటే బిన్ లాడెన్ను అడగండి
- అమెరికన్ల రక్షణకే తొలి ప్రాధాన్యం, ఆ తర్వాతి లక్ష్యం ఉగ్రవాదులు
- అమెరికా అస్తిత్వానికి ఐఎస్ ప్రమాదకరం కాదు
- ఆల్ ఖాయిదా, ఐఎస్ నుంచి మనకు ముప్పు పొంచి ఉంది. ఈ ఉగ్రవాద సంస్థలపై మన విదేశాంగ విధానం దృష్టిపెట్టాలి
- ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలు, ఆప్రికా, ఆసియాలో అస్థిరత ఉంది. వీటిలో కొన్ని దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షిత ప్రాంతాలుగా మారే అవకాశముంది