అమెరికాకు ఆస్ట్రేలియా 'సైన్య' సహకారం!
కాన్ బెర్రా: ఇరాక్ లోని పేట్రేగుతున్న ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు ఆస్ట్రేలియా బలగాలు సమాయత్తమయ్యాయి. మధ్య తూర్పు ఇరాక్ కు తమ దేశం నుంచి భారీగా బలగాలను పంపడానికి నిర్ణయించినట్లు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తెలిపారు. ఈ మేరకు అగ్రరాజ్యం అమెరికా నుంచి విన్నపం వచ్చిన నేపథ్యంలో తమ సైన్యాన్ని పంపడానికి సిద్దమైనట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇస్లామిక్ రాజ్యం స్థాపనే లక్ష్యంగా ఇరాక్ లో దాడులకు పాల్పడుతున్నఐఎస్ ఉగ్రవాదులను తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధమైన క్రమంలో ఆస్ట్రేలియా సహకారం కోరింది. ఇందుకు ఆస్ట్రేలియా 600 సైనిక బలగాలను, 8 అత్యుత్తమ వైమానిక దళాలను తమ దేశం నుంచి పంపడానికి సిద్ధమైంది. ఇరాక్, సిరియాలలో ఆక్రమణలకు పాల్పడుతూ దాడులకు తెగబడుతున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎల్ ను దెబ్బతీసి అంతిమంగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల ఏరివేతలో సమగ్ర వ్యూహ రచనతో ముందుకెళ్తామని గురువారం ‘వైట్‌హౌస్’ నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి 15 నిమిషాలపాటు చేసిన టీవీ ప్రసంగంలో ఆయన ప్రకటించారు.