బిన్‌ లాడెన్‌ డైరీలో ఏముందంటే..! | osama Bin laden Diary released by CIA | Sakshi
Sakshi News home page

బిన్‌ లాడెన్‌ డైరీలో ఏముందంటే..!

Published Thu, Nov 2 2017 8:04 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

osama Bin laden Diary released by CIA - Sakshi

కశ్మీర్‌ నుంచి కామిక్స్‌ దాకా...
ఉగ్రభూతం విరుచుకుపడితే ఎలా ఉంటుందో ఎవరికీ ఊహకందని రీతిలో ప్రపంచానికి చూపించిన కరడుగట్టిన తీవ్రవాది, ఆల్‌ఖైదా అధినేత ఒసామా బిన్‌ లాడెన్‌ ఆసక్తులు, అభిరుచులు, అబోటాబాద్‌లో అజ్ఞాతంలో ఉన్నపుడు అతని కార్యకలాపాలు సహా పలు వివరాలను అమెరికా నిఘా సంస్థ సీఐఏ బుధవారం బయటపెట్టింది. లాడెన్‌కు సంబంధించిన 4.7 లక్షల పత్రాలు, ఫోటోలు, వీడియోలను సీఐఏ బహిర్గతం చేసింది. 

పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లోని లాడెన్‌ రహస్య స్థావరంపై అమెరికా 2011 మే 2న మెరుపుదాడి చేసి... ఈ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాదిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ దాడి సందర్భంగా అమెరికా నావికాదళానికి చెందిన సీల్స్‌ లాడెన్‌ నివాసం నుంచి ఒక కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ కంప్యూటర్లోని 321 గిగాబైట్ల సమాచారాన్ని సీఐఏ ఆన్‌లైన్‌లో జనానికి అందుబాటులోకి తెచ్చింది. 18,000 పత్రాలు, 79,000 వేల ఆడియో ఫైల్స్, ఫోటోలు, 10 వేలకు పైగా వీడియోలు ఇందులో ఉన్నట్లు సీఐఏ డైరెక్టర్‌ మైక్‌ పాంపియో వెల్లడించారు. లాడెన్‌ అరబిక్‌లో రాసుకున్న 228 పేజీల డైరీ కూడా ఇందులో ఉంది. 2015 తర్వాత లాడెన్‌కు సంబంధించిన రహస్యంగా ఉంచిన సమాచారాన్ని అమెరికా బహిర్గతం చేయడం ఇది నాలుగోసారి.

కశ్మీర్‌ పరిణామాలను నిశితంగా...
ఫోన్, ఇంటర్నెట్‌ వాడితే దొరికిపోయే అవకాశాలుంటాయి కాబట్టి అబోటాబాద్‌లోని నివాసంలో లాడెన్‌ వీటిని వాడలేదు. అయినప్పటికీ అతని కంప్యూటర్లో వర్తమాన వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రికల క్లిప్పింగులు ఉన్నాయి. వీటిని ఎవరో సేకరించి లాడెన్‌కు చేరవేసేవారు. కశ్మీర్‌ పరిణామాలను లాడెన్‌ నిశితంగా గమనించేవాడని అతని కంప్యూటర్లో దొరికిన పత్రికల క్లిప్పింగులు స్పష్టం చేస్తున్నాయి. 2008 ముంబై దాడులకు కుట్రలో పాత్రధారి అయిన డేవిడ్‌ హెడ్లీ విచారణను సంబంధించిన వార్తలను కూడా లాడెన్‌ క్రమం తప్పకుండా చదివాడు. హెడ్లీకి ఆదేశాలిచ్చిన పాకిస్తానీ ఇలియాస్‌ కశ్మీరీకి సంబంధించిన వార్తా క్లిప్పింగులు, ఆల్‌ఖైదా, తాలిబన్ల వార్తలను చదివాడు. హుజీతో డేవిడ్‌ హెడ్లీ కోడ్‌ భాషలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలపై టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో వచ్చిన వార్త తాలూకు క్లిప్పింగ్‌ కూడా లాడెన్‌ కంప్యూటర్లో ఉంది. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రిక, పీటీఐ వార్తా సంస్థ కశ్మీర్‌పై ఇచ్చిన వార్తల క్లిప్పింగులూ ఉన్నాయి.

కుమారుడి పెళ్లి వీడియో...
లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ పెళ్లి వీడియో కూడా సీఐఏ విడుదల చేసింది. ఇందులో లాడెన్‌ కనిపించలేదు కాని పలువురు ఆల్‌ఖైదా నాయకులు నిఖాలో పాల్గొన్నట్లు ఉంది. అతిథుల కోసం సిద్ధం చేసిన పళ్లు, స్వీట్లు, కోకకోలా, టీ... తదితరాలు వీడియోలో కనిపించాయి. చిన్న పిల్లలు ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్న ఫుటేజీ కూడా ఉంది. 

నీలిచిత్రాలు... డాక్యుమెంటరీలు
లాడెన్‌ కంప్యూటర్లో కొన్ని నీలిచిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా లభించాయి. అమెరికా భద్రతకు సంబంధించిన కీలకమనుకున్న పత్రాలు, వీడియోలను విడుదల చేయలేదని పాంపియో తెలిపారు. అలాగే నీలి చిత్రాలు, కాపీరైట్‌ ఉన్న డాక్యుమెంటరీలను విడుదల చేయలేదు. తనపై ప్రసారమైన మూడు డాక్యుమెంటరీలను కూడా లాడెన్‌ కంప్యూటర్లో దాచుకున్నాడు. ఈ ప్రపంచంలో లాడెన్‌ ఎక్కడ? అనే డాక్యుమెంటరీ కూడా ఉంది. అలాగే భారతదేశ చరిత్రపై బీబీసీ ప్రసారం చేసిన ‘స్టోరీ ఆఫ్‌ ఇండియా’ కూడా లాడెన్‌ సేకరించాడు. కుంగ్‌ ఫూ కిల్లర్స్, వరల్డ్స్‌ వరస్ట్‌ వెనమ్‌... అనే డాక్యుమెంటరీలు కూడా అతని వద్ద ఉన్నాయి. 

యానిమేటెడ్‌ చిత్రాలు, కార్టూన్‌ షోలు కూడా లాడెన్‌ కంప్యూటర్లో ఉన్నాయి. యాంట్జ్, కార్స్, చికెన్‌ లిటిల్, త్రీ మస్కెటీర్స్‌ లాంటి వాటితో పాటు హాలీవుడ్‌ చిత్రాలు కూడా లభించాయి. టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి కార్టూన్‌ షోల వీడియోలు, బుట్టల అల్లికలకు సంబంధించిన వీడియో పాఠాలూ ఉన్నాయి. తీవ్రవాద గ్రూపుల మధ్య సైద్దాంతిక విబేధాలు, ట్విన్‌ టవర్స్‌పై దాడి జరిగి పదేళ్లు అయిన సందర్భాన్ని ఎలా నిర్వహించాలనే చర్చల వివరాలు కూడా దొరికాయి. 

అలాగే అప్పుడే పుంజుకుంటున్న ఐసిస్‌తో ఆల్‌ఖైదా విబేధాల వివరాలు ఉన్నాయి. వివిధ తీవ్రవాద గ్రూపుల మధ్య సయోధ్యకు లాడెన్‌ యత్నించాడనే వివరాలు, అరబ్‌ దేశాల్లో ప్రజా తిరుగుబాట్లపై ఆల్‌ఖైదా ఎలా స్పందించింది, వాటిని ఏ దృష్టితో చూసిందనే వివరాలున్నాయి. మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని అధిగమించి ముస్లింలలో తమ ప్రతిష్టను పెంచుకోవడానికి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఆల్‌ఖైదా నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయమూ బయటపడింది. 

సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్‌ దేశాల్లో అమెరికా ప్రయోజనాలను దెబ్బకొట్టడానికి కలిసి పనిచేయాలని ఇరాన్, ఆల్‌ఖైదాలు అవగాహనకు వచ్చి పనిచేశాయని ఇంతవరకు వెలుగుచూడని ఓ 19 పేజీల ఫైల్‌లో ఉంది. లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద శిబిరాల్లో ఖైదా మిలిటెంట్లకు శిక్షణ ఇప్పించడమే కాకుండా ఆయుధాలు, డబ్బును ఇరాన్‌ సమకూర్చినట్లు ఇందులో వివరాలున్నాయి. ఇరాన్‌తో కుదిరిన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రవాదులకు ఇరాన్‌ సహాయం చేస్తోందనేది చూపించడానికి తాజా ఫైల్స్‌ను విడుదల చేయించారని పరిశీలకులు భావిస్తున్నారు.
                                                                                                                                                    – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement