పొట్టి డ్రెస్సుల్లో మహిళా ఖైదీల పార్టీ
రియోడిజెనీరో: ఎవరైనా తప్పు చేస్తే జైలుకు పంపిస్తారు. ఎందుకంటే అక్కడి పరిస్థితులు చూసైనా ఇంకోసారి తప్పు చేయకూడదనే భయం వారిలో కలుగడానకి. కానీ, ఉత్తర బ్రెజిల్ లోని క్యూరాడో జైలులో మహిళా ఖైదీలను చూస్తే అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. ఏకంగా కొకైన్వాడకంతో పాటూ పొట్టి పొట్టి డ్రెస్లు, పాటలకు స్టెప్పులు, ఫోన్లతో సెల్ఫీలు మొత్తంగా చెప్పాలంటే ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో జైలు అధికారులపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
స్థానిక బ్లాగర్ కార్లోస్ డిసిల్వా తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. 'ఈ వీడియోను చూసి బ్రేజిల్ సిగ్గుపడాలి. కటకటాల్లో మహిళా ఖైదీలు రాజభోగాలు అనుభవిస్తుండటం దారుణం. పెద్ద మొత్తంలో మదకద్రవ్యాల వినియోగంతో పాటూ జైలులో మద్యం ఏరులై పారుతోంది.
తప్పు చేసిన వారికి ఇస్తున్న సకల సౌకర్యాలను చూస్తే కష్టపడి పని చేస్తూ ఇంటిని, పిల్లలను చూసుకుంటున్న మహిళలను అవమానించినట్టే. పన్ను కడుతూ ప్రభుత్వానికి సహకరిస్తే తప్పు చేసి శిక్ష అనుభవిస్తున్నవారికి ఇలాంటి సౌకర్యాలా' అని తన ఫేస్ బుక్ పేజీలో కార్లోస్ పోస్ట్ చేశారు. ఈ వీడియోను జైలులోనే శిక్ష అనుభవిస్తున్న మరో ఖైదీ అందించింది. ఆమె ప్రాణాలకు హాని ఉండే అవకాశం ఉండటంతో పేరు ప్రస్తావించడం లేదని పేర్కొన్నారు. ఈ వీడియో బయటకు పొక్కడంతో బ్రెజిల్వాసులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.