ఇస్లామాబాద్ : భారత వైమానిక దళ యోధుడు, పైలట్ అభినందన్ స్వదేశానికి తిరిగి వస్తున్నారని దేశమంతా ఆనంద డోలికల్లో మునిగిపోయిన వేళ పాకిస్తానీయులు మరోసారి కపట బుద్ధి ప్రదర్శించారు. అభినందన్‌ను విడుదల చేయాలంటూ తమ దేశమంతా కోరుకుంటోందని చెబుతూనే.. మరోవైపు అతడిని ఎలా విడిచి పెడతారంటూ పలువురు పాక్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించిన ఇస్లామాబాద్ కోర్టు.. దీనికి ఎటువంటి విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టివేసింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అభినందన్ విడుదలపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. కాగా భారత్ సహా అంతర్జాతీయ సమాజం ఒత్తిడికి తలొగ్గిన పాక్... తమ ఆర్మీకి చిక్కిన పైలట్ అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం.. ఆయనను రావల్పిండి నుంచి లాహోరుకు విమానంలో తరలించనుంది. దీంతో శుక్రవారం ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వారా మధ్యహ్నం రెండు గంటల తరువాత అభినందన్ భారత్‌లో అడుగు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment