
మేం దేనికైనా రెడీ: పాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సవాలుకైనా తాము సిద్ధమన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు తమ దేశ సైన్యం సిద్ధంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ లో జరుగుతున్న దారుణ పరిణామాలు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు, ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఆడిన ఆట అని ప్రధాని నవాజ్ షరీఫ్ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'భారత్లో ఎలాంట పరిణామాలు జరుగుతున్నాయో.. అవి మా దేశ రక్షణపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనన్న విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సవాలునైనా, ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది' అంటూ రహీల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. యూరీ సెక్టార్ పై దాడిలో పాక్ ప్రమేయం ఉందన్న భారత్ ఆరోపణలు ఆధారం లేనివని, బాధ్యతారహితంగా చేసినవని కూడా సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.