
నవాజ్‌కు పాక్ ఆర్మీ షాక్
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ రహస్యాలను మీడియాకు లీక్ చేసిన వ్యవహారంలో
ప్రధాని ఆదేశాల తిరస్కరణ
ఇస్లామాబాద్: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ రహస్యాలను మీడియాకు లీక్ చేసిన వ్యవహారంలో తన ప్రత్యేక సహాయకుడు తారీఖ్ ఫతేమీని తొలగించాలన్న నవాజ్ ఆదేశాలను పాక్ సైన్యం తిరస్కరించింది. నివేదికను అమలు చేయడంలో షరీఫ్ చర్యలు అసంపూర్ణంగా ఉన్నాయంది. భారత్, అఫ్గానిస్తాన్‌లలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశంలోని ఉగ్రస్థావరాలపై చర్య తీసుకునే విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు ఓ సమావేశాన్ని ఉటంకిస్తూ డాన్ పత్రిక గతంలో కథనాన్ని ప్రచురించింది. కథనాన్ని అప్పట్లోనే పాక్ సైన్యం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
ప్రభుత్వ రహస్యాలు బయటికి పొక్కడంపై ప్రధాని నవాజ్ విచారణకు ఓ కమిటీని నియమించారు. విదేశీ వ్యవహారాల్లో ప్రధానికి ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఫతేమీని దోషిగా తేల్చిన కమిటీ, ఆయన్ను విధుల నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ ఘటన వల్ల పాక్ సమాచార మంత్రి పర్వేజ్ రషీద్ పదవి నుంచి అర్ధంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. కమిటీ రిపోర్టును ఆమోదించిన షరీఫ్ ఫతేమీని తొలగించాలని ఆదేశాలిచ్చారు.