ఎస్‌సీఓ వద్ద విభేదాలొద్దు
భారత్, పాకిస్తాన్‌లకు స్పష్టం చేసిన చైనా
బీజింగ్: షాంఘై సహకార కూటమి (ఎస్‌సీఓ)లో భారత్, పాక్‌లు తమ ద్వైపాక్షిక విభేదాల్ని లేవనెత్తకూడదని చైనా స్పష్టం చేసింది. ఆ మేరకు కూటమి నిబంధనల్ని రెండు దేశాలు కచ్చితంగా పాటించాలని సూచించింది. భారత్, పాక్‌లను అధికారికంగా ఎస్‌సీఓలోకి ఆహ్వానిస్తూ గురువారం బీజింగ్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇరు దేశాల్ని కొత్త సభ్య దేశాలుగా ఖరారు చేస్తూ భారత్, పాక్‌ల జాతీయ పతాకాల్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కోంగ్ గ్జుయాన్యు ప్రసంగిస్తూ.. భారత్, పాకిస్తాన్‌లు షాంఘై సహకార కూటమిలో సభ్యత్వం పొందడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ‘ఎస్‌సీఓ చాప్టర్‌లో సూచించిన నిబంధనల మేరకు ద్వైపాక్షిక సమస్యల్ని ఇరుదేశాలకు కూటమి ముందుకు తేకూడదు. రెండు దేశాలు ఈ నిబంధనకు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నా’నని కోంగ్ అన్నారు. చైనా, భారత్, పాకిస్తాన్‌ల అభివృద్ధి క్రమం, సవాళ్లు ఒకేవిధంగా ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు మూడు దేశాలు కలసికట్టుగా ముందుకు సాగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి
చైనాలో భారత రాయబారి విజయ్ గోఖలే మాట్లాడుతూ.. ‘ఎస్‌సీఓ పరిధిలో సంబంధాల మెరుగుదలకు, వాణిజ్య విస్తరణకు భారత్ మద్దతిస్తుంది. అయితే దేశ సార్వభౌమత్వం, సమైక్యతను గౌరవించేలా అవి కొనసాగాల’ని ఎల్‌ఓసీలో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, అతివాదంపై పోరులో పరస్పర సహకారానికి ఆసక్తిగా ఉన్నామని, అంతరిక్షం, ఐటీ రంగాల్లో నైపుణ్యాన్ని సభ్య దేశాలతో పంచుకునేందుకు సిద్ధమని గోఖలే స్పష్టం చేశారు.
జూన్ 8, 9 తేదీల్లో కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగిన ఎస్‌సీఓ సదస్సులో భారత్, పాకిస్తాన్‌లను సభ్య దేశాలుగా చేర్చుకున్న సంగతి తెలిసిందే. ఎస్‌సీఓలో మొత్తం 8 సభ్య దేశాలుండగా.. కూటమికి చైనా నేతృత్వం వహిస్తోంది. చైనాతో పాటు రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్‌లు సభ్య దేశాలు కాగా.. అఫ్గానిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా కొనసాగుతున్నాయి