పెషావర్ దాడి ముష్కరుల ఉరితీత
పెషావర్ దాడి ముష్కరుల ఉరితీత
Published Wed, Dec 2 2015 1:43 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూలు ఉగ్రదాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం ఉరితీసింది. కోహత్ జిల్లాలోని కారాగారంలో బుధవారం వీరికి ఈ శిక్ష అమలైంది. పెనువిషాదాన్ని నింపిన ఈ దారుణ మారణకాండలో అబ్దుల్ సలాం, హజ్రత్ అలీ, ముజీబ్ ఉర్ రెహమాన్, అలియాస్ నజీబ్ ఉల్లా, సబీల్‌లను దోషులుగా నిర్ధారించారు. ఈ నలుగురు ఉగ్రవాదులు తెహాద్వాల్ జిహాద్ గ్రూపు చెందినవారని గుర్తించింది. దీనికి సంబంధించిన పత్రాలపై సైనిక ప్రధానాధికారి జనరల్ రషీల్ షరీప్ సోమవారం సంతకం చేశారు. మరోవైపు ఈ ఘటన జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, ఈ ఘటనలో అసువులు బాసిన చిన్నారులకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దేశ అధ్యక్షుడు హుస్సేన్ ఆగస్టులో తిరస్కరించారు. వీరిపై వివిధ అభియోగాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం దోషులుగా తేల్చడంతో కోర్టు వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబర్ 16 న పెషావర్‌లోని ఓ ఆర్మీ స్కూలుపై దాడిచేసిన ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. పాక్ స్కూల్లో సైనికదుస్తుల్లో ప్రవేశించిన ముష్కరులు నేరుగా పిల్లలపై కాల్పులకు తెగబడ్డారు. పిల్లల్లో పెద్దవాళ్లని ఏరి మరీ కాల్చిచంపారు. ఈ ఘటనలో 150 మంది బలైన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement