కోర్టురూమ్‌లో గాడ్సే (ఎడమ చివర)
స్వతంత్ర భారతి 1949/2022 ఘట్టంలో.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి గాంధీజీపై నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్పులు జరిపాక అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో వారి నుంచి గాడ్సే తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.
గాంధీ హత్య ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరణ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఏడాది తర్వాత 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్ సావర్కర్‌కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు.
ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం 1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు. ‘‘శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతులు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది.
ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశాడు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాడు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం అప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు’’ అని చరిత్రకారులు కొందరు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment