
అక్కడ వరదల్లో మూడు లక్షలమంది..
న్యూయార్క్: ఇటీవల సంభవించిన వరదల కారణంగా పాకిస్థాన్లోని లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. మొత్తం 2,85,000 మంది ఈ వరదల భారిన పడి కనీసం కూడు, గుడ్డ, నీడ లేనివారుగా మారారని ఒక ప్రకటనలో పేర్కొంది. భారీ స్థాయిలో సంభవించిన వర్షాలతో పాటు వేగంగా కరుగుతున్న మంచువల్ల భారీ వరదలు సంభవించాయని, ముఖ్యంగా చిత్రాల్ అనే జిల్లా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం ప్రకటించిన బాధితుల సంఖ్య కేవలం ఒక అంచనా మాత్రమేనని, అడుగుపెట్టలేని వాతవారణం కారణంగా పూర్తి స్థాయిలో బాధితులు ఎంతమందో లెక్కతేల్చలేకపోతున్నామని వివరించింది. సంక్షోభంలో ఉన్న ప్రజానీకానికి ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సేవలు అందించేందుకు ఐక్యరాజ్యసమితిలో ఒక ప్రత్యేక విభాగం ఉంది. ప్రకృతి విపత్కర పరిస్థితులు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేయడం ద్వారా బాధితులకు సహాయం అందించాలనే విషయాన్ని తెలియజేస్తుంది.