
కరాచీ: బాలాకోట్ దాడికి ప్రతీకారంగా విధించిన గగనతల నిషేధంతో భారత్‌తోపాటు పాకిస్తాన్ కూడా నష్టపోయింది. భారత్ విమానాల రాకపోకలపై విధించిన నిషేధం కారణంగా రూ.345 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాక్ విమానయాన శాఖ మంత్రి గులాం సర్వర్ ఖాన్ ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత్ విమానాల రాకపోకలపై విధించిన గగనతల నిషేధం కారణంగా పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కూడా కొన్ని సర్వీసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పౌర విమానయాన విభాగం రూ.345 కోట్ల మేర నష్ట పోయింది. మొత్తమ్మీద ఇది చాలా పెద్ద నష్టం. అయితే, భారత్‌కు ఇంతకు రెండింతలు నష్టం వాటిల్లింది’ అని అన్నారు.
సరిహద్దులకు సమీపంలో మోహరించిన యుద్ధ విమానాలను భారత్ ఉపసంహరించుకున్న తర్వాతే గగనతల నిషేధాన్ని తొలగించినట్లు పాక్ విమానయాన శాఖ కార్యదర్శి షారుఖ్ నుస్రత్ తెలిపారు. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం ఫిబ్రవరిలో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ చర్యకు ప్రతీకారంగా భారత ప్రయాణికుల విమానాలు తమ గగనతలం మీదుగా రాకపోకలు సాధించడంపై పాక్ నిషేధం విధించింది. దీంతో పాక్ భూభాగం మీదుగా అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులను ఎయిరిండియా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎయిరిండియా రూ.430 కోట్ల మేర నష్టపోయింది. పాక్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు కొద్ది రోజులకు ముందు పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఎయిరిండియాకు పెద్ద ఊరటనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment