పాకిస్థాన్‌కు రూ. 2వేల కోట్ల సాయం కట్?
పాకిస్థాన్‌కు దాదాపు రూ. 2వేల కోట్ల సైనిక సాయాన్ని నిలిపివేసేందుకు వీలుగా ఒక చట్టాన్ని సెనేట్ సంఘం ఆమోదించింది. హక్కానీ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను అణిచివేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ రుజువు చేసుకోలేకపోతే ఈ సాయాన్ని ఆపేస్తారు. గత సంవత్సరం నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టాన్ని ఆమోదించినట్లే ఈసారి కూడా సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ కొత్త చట్టాన్ని ఆమోదించింది. గత సంవత్సరపు చట్టం మాత్రం పాక్‌కు భద్రతాపరమైన సాయాన్ని కొనసాగించాలని తెలిపింది.
ఈ సంవత్సరానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉందని పెంటగాన్ అధికార ప్రతినిధి, నేవీ కెప్టెన్ జెఫ్ డేవిస్ తెలిపారు. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌కు సైనిక సాయం అందించడంపై అమెరికా పలు విమర్శలను ఎదుర్కొంది. ఈ అంశాన్ని కూడా కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పాక్ అంతర్గత భద్రత, సుస్థిరత కూడా ఆ ప్రాంతంలో సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చాలా కీలకం అని సెనేట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.