పాకిస్థాన్‌కు షాకిచ్చిన పెంటగాన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక సాయం విషయంలో పాకిస్థాన్ ఆర్మీకి ఎదురుదెబ్బ తగిలింది. మిలిటరీ రీయింబర్స్‌మెంట్ సాయం కింద 300 మిలియన్ డాలర్ల (రూ. 2009 కోట్ల)ను పాక్ సైన్యానికి పెంటగాన్ అందించాల్సి ఉండగా.. ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని తాజాగా అమెరికా స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌లో యథేచ్ఛగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న హక్కానీ నెట్‌వర్క్‌ను అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని, కాబట్టి పెంటగాన్ ఈ సాయాన్ని నిలిపివేయనుందని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా-పాకిస్థాన్ మధ్య గత దశాబ్దకాలంగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. పాక్‌లో ఇస్లామిక్ గ్రూపులైన ఆఫ్గన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు పాక్ ప్రభుత్వం నిరాకరిస్తుండటం అమెరికాను చికాకు పరుస్తున్నది.
ఈ నేపథ్యంలో హక్కానీ నెట్‌వర్క్ అణచివేత విషయంలో పాక్ చర్యలను ధ్రువీకరిస్తూ అమెరికా రక్షణశాఖ కార్యదర్శి యాష్ కార్టర్ కాంగ్రెస్ (చట్టసభ)కు నివేదించాల్సి ఉంది. అయితే, పాక్ చర్యల విషయంలో సంతృప్తిగాలేని రక్షణమంత్రి ఈ విషయమై కాంగ్రెస్‌కు ఏమీ చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉగ్రవాద నియంత్రణలో భాగంగా కొలియేషన్ సపోర్ట్ ఫండ్ కింద మిత్రదేశాలకు అందించే ఆర్థిక సాయాన్ని ఈ ఏడాది పాకిస్థాన్‌కు అందజేయబోమని రక్షణశాఖ (పెంటాగాన్) అధికారులు తెలిపారు.