ఇస్లామాబాద్ : కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు. ఇందుకు సంబంధించి చట్టబద్ధ అంశాలను చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం వెల్లడించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో పాకిస్తాన్ భారత్‌పై విద్వేషపూరిత వైఖరి ప్రదర్శిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న దాయాది దేశానికి అడుగడుగునా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా రష్యా కశ్మీర్ అంశంలో భారత్‌ను సమర్థించాయి. దీంతో కంగుతిన్న పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనా సహాయంతో ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని చర్చించే దిశగా పావులు కదిపింది. ఈ క్రమంలో చైనా జోక్యంతో యూఎన్ భద్రతా మండలిలో గత శుక్రవారం కశ్మీర్ విషయమై రహస్య సమావేశం జరిగింది. కానీ యూఎన్ శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే ఇది భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేశాయి. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిని చేద్దామనుకున్న పాకిస్తాన్‌కు చుక్కెదురైంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రభుత్వాన్ని ఫాసిస్టు, జాత్యహంకారిగా అభివర్ణించిన విషయం తెలిసిందే. అదే విధంగా భారత్ దుస్సాహసానికి పాల్పడితే, కశ్మీరీల హక్కులు కాపాడేందుకు తమ ఆర్మీ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇక పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి కూడా నెహ్రూ భారతదేశాన్ని నరేంద్ర మోదీ సమాధి చేశారంటూ అక్కసు వెళ్లగక్కారు. భారత విధానం మొత్తం దోవల్ సిద్ధాంతం చుట్టే తిరుగుతోందని విమర్శించారు. ‘పాకిస్తాన్ ఒక బాధ్యతాయుతమైన దేశం. కానీ భారత్ అలా కాదు. మమ్మల్ని బెదిరిస్తూ ఉంటుంది. భారత ఆక్రమిత కశ్మీర్ వారి బలగాల రాకతో జైలులా మారింది. అసత్యాలను ప్రచారం చేసేందుకు, జెండాలను ఎగురవేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నాం. అదే విధంగా కశ్మీర్ అంశంపై యూఎన్‌లో చర్చ జరిగింది. దీంతో భారత్ దుస్సాహసానికి పాల్పడవచ్చు. అయితే వారి చర్యలకు దీటుగా జవాబిచ్చేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది’ అని పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఆర్మీ మీడియా వింగ్) అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఐక్యరాజ్యసమితిలో కూడా మద్దతు లభించకపోవడంతో పాక్‌కు అన్ని దారులూ ముసుకుపోయినట్లేనని విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తామంటూ పాక్ మరో ఎత్తుగడకు సిద్ధమైందని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment