
ఇస్లామాబాద్: భారత వైమానిక దళాలు మెరుపు దాడులు జరిపిన ఘటనా స్థలం (పీఓకే) వద్దకు అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వైమానికి దళాలు తెల్లవారుజామున ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఖురేషీ స్పందిస్తూ.. పీఓకేలో ప్రస్తుతం పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని, హెలికాఫ్టర్లు కూడా వెళ్లలేని స్థితిలో ఉందని ఆయన పేర్కొన్నారు. భారత చర్యను ఖండించేందుకు పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం అంతర్జాతీయ మీడియాను అక్కడికి తీసుకెళ్లి.. వివరిస్తామని స్పష్టంచేశారు.
భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో మెరుపు దాడులు జరిపిన నేపథ్యంలో పాక్ సైన్యం అప్రమత్తమైంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సమావేశం అనంతరం పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్‌ఎస్‌సీ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారత దాడిని ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై ప్రముఖంగా చర్చించినట్లు తెలుస్తోంది. పాక్- భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌సీ ఆదేశాల మేరకు పాక్ సైన్యం అలర్టయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment