పాక్‌లో సామూహిక ప్రార్థనలకు అనుమతి | Pakistan Says Mosques To Remain Open For Ramzan Prayers Amid Covid 19 | Sakshi
Sakshi News home page

మసీదుల్లో రంజాన్‌ ప్రార్థనలకు పాక్‌ అనుమతి

Published Mon, Apr 20 2020 4:46 PM | Last Updated on Mon, Apr 20 2020 4:51 PM

Pakistan Says Mosques To Remain Open For Ramzan Prayers Amid Covid 19 - Sakshi

ఇస్లామాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ నేపథ్యంలో మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం విదితమే. ముఖ్యంగా రంజాన్‌ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత ఇదే బాటలో నడిచిన పాకిస్తాన్‌ తాజాగా యూటర్న్‌ తీసుకుంది. రంజాన్‌ మాసం మొదలుకానున్న తరుణంలో షరతులతో మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మత గురువులతో ఆన్‌లైన్‌లో చర్చలు జరిపిన పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహిక ప్రార్థనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే మతపెద్దలు ఇందుకు  ససేమిరా అనడంతో ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. (భారత్‌ పాక్‌ మధ్య మాటల యుద్ధం)

ఈ నేపథ్యంలో 20 అంశాల ప్రణాళిక ప్రతిపాదించి.. అధ్యక్షుడు మత గురువులను ఒప్పించారు.  మసీదుల్లో తారావీ ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతించామన్న ఆయన... ప్రార్థనా సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సామూహిక ప్రార్థనల నేపథ్యంలో మసీదుల్లో పాటించాల్సిన నిబంధనల గురించి మార్గదర్శకాలు జారీచేశారు.(అమెరికా కంటే అధ్వాన్నంగా: బిలావల్‌ భుట్టో)

  • 1. కార్పెట్లు, చాపలు పరచి ప్రార్థనలు చేయరాదు. మసీదు ఫ్లోర్‌ను ప్రతిరోజు విధిగా శుభ్రం చేసుకోవాలి.
  • 2. ఇంటి నుంచే చాపలు తెచ్చుకుంటే అభ్యంతరం లేదు.
  • 3. ప్రార్థనల అనంతరం ఎవరూ గుమిగూడకూడదు.
  • 4. గార్డెన్‌ ప్రాంతం కలిగి ఉన్న మసీదుల్లో ఆరుబయటే ప్రార్థనలు చేస్తే మంచిది.
  • 5. 50 ఏళ్లకు పైబడిన వారు, పిల్లలను మసీదులోకి అనుమతించరు.
  • 6. ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణుల సూచనల ప్రకారం కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి.
  • 7. రోడ్లు, ఫుట్‌పాత్‌లు సహా ఇతర ప్రాంతాల్లో(బహిరంగ ప్రదేశాల్లో)తారావీ ప్రార్థనలు చేయరాదు 
  • 8. ఇంట్లో ప్రార్థనలు చేయడం శ్రేయస్కరం.
  • 9. క్లోరినేటెడ్‌ వాటర్‌తో మసీదు పరిసరాలు శుభ్రపరచాలి
  • 10. ప్రార్థనా సమయంలో ఒక్కో వ్యక్తి మరో వ్యక్తి నుంచి కనీసం ఆరు ఫీట్ల దూరంలో ఉండాలి
  • 11. షేక్‌హ్యాండ్లు, ఆలింగనాలను పూర్తిగా మానేయాలి
  • 12. ఇఫ్తార్‌, షేరీ విందులు నిర్వహించకూడదు తదితర 20 అంశాల ప్రణాళిక గురించి వారికి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement