పాక్ సైన్యంలో ఉగ్రవాదులు
వాషింగ్టన్: భారత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ఉగ్రవాద గ్రూపులను పాక్ ఉపయోగించుకుంటోందని అమెరికా రక్షణ కార్యాలయం పెంట గాన్ ఆ దేశ కాంగ్రెస్‌కు నివేదించింది. అఫ్ఘానిస్థాన్, భారత్‌లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మిలిటెంట్లు పాక్ భూభాగంలోనే అడ్డా వేశారని పేర్కొంది. పొరుగు దేశాలను దెబ్బతీయడం ద్వారా ప్రాంతీయ అస్థిరతకు ఈ గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. అఫ్ఘాన్‌లో పరిస్థితిపై ఆరు నెలలకోమారు అమెరికన్ కాంగ్రెస్‌కు ఇచ్చే నివేదికలో భాగంగా పెంటగాన్ ఈ విషయాలను వెల్లడించింది.
అఫ్ఘాన్‌పై పట్టు సాధించడానికి, బలమైన భారత సైన్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులనే నకిలీ దళాలుగా పాక్ వినియోగించుకుంటోందని స్పష్టం చేసింది. అఫ్ఘాన్ పునర్నిర్మాణానికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూనే పరోక్షంగా ఉగ్రవాద గ్రూపులను పాక్ ఉపయోగించుకుంటోందని తన వంద పేజీల నివేదికలో వివరించింది. భారత్‌లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయడానికి మూడు రోజుల ముందే అఫ్ఘాన్‌లోని హెరాత్‌లో గల భారత రాయబార కార్యాలయంపై దాడి జరిగిన విషయాన్ని కూడా పెంటగాన్ ప్రస్తావించింది. హిందూవాద గ్రూపులకు అనుకూలుడిగా మోదీకి పేరున్నందున, ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడింది. భారత్ మాత్రం అఫ్ఘానిస్థాన్‌కు సాయం అందిస్తూనే ఉందని, అఫ్ఘాన్ బలోపేతమైతే ప్రాంతీయ సుస్థిరత ఏర్పడుతుందని భారత్ భావిస్తోందని పేర్కొంది. దీనివల్ల మధ్య ఆసియాతో ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తోందని, ఈ దిశగానే ఇరు దేశాల మధ్య బంధం పటిష్టమవుతోందని వివరించింది. అఫ్ఘాన్‌లో అనేక మౌలికవసతుల ప్రాజెక్టులను భారత్ చేపడుతోందని, అక్కడి భద్రతా దళాలకు శిక్షణ ఇస్తోందని తెలిపింది.
పాక్ పాత్రకు ఇదే నిదర్శనం: భారత్
న్యూఢిల్లీ: సైనికపరంగా భారత్‌ను ఎదుర్కొనేందుకు ఉగ్రవాదులను పాకిస్థాన్ వాడుకుంటోందన్న పెంటగాన్ నివేదికపై భారత్ స్పందించింది. అంతర్జాతీయ ఉగ్రవాదంలో పాకిస్థాన్ భాగస్వామ్యానికి సంబంధించి అంతర్జాతీయంగా లభిస్తున్న ఆమోదానికి, పెరుగుతున్న మద్దతుకు పెంటగాన్ నివేదికే తాజా రుజువని పేర్కొంది.