ఇస్లామాబాద్ : అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) నిర్వహించనున్న విదేశాంగ మంత్రుల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహ్మద్ ఖురేషీ తెలిపారు. మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో జరిగే ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఓఐసీ సమావేశానికి భారత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. అయితే మంగళవారం నాటి భారత్ మెరుపు దాడులకు నిరసనగా ఖురేషీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఖురేషి మాట్లాడుతూ.. ‘యూఏఈ విదేశాంగ మంత్రితో మాట్లాడాను. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సమావేశానికి హాజరవుతుండడంపై అభ్యంతరాలను వారికి వివరించాను’ అని తెలిపారు.
ఐఓసీలో దాదాపు 57 సభ్యదేశాలు ఉన్నాయి. అయితే గతంలో అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశంలో కశ్మీర్ అంశాన్ని చర్చించడం పై భారత్ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ విషయంలో ఓఐసీ మొదటి నుంచి పాక్‌కు సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తోంది. (ఓఐసీ సదస్సుకు భారత్)
Comments
Please login to add a commentAdd a comment